IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్‌

26 Apr, 2022 16:00 IST|Sakshi
ఆయుష్‌ బదోని, తిలక్‌ వర్మ(ఫొటో కర్టెసీ: IPL/BCCI)

IPL 2022: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడితే కాసుల వర్షం కురవడమే కాదు.. ఒక్కసారి తమను తాము నిరూపించుకుంటే జాతీయ జట్టు తరఫున ఆడే ఛాన్స్‌ వస్తుందన్న నమ్మకాన్ని ఆటగాళ్లలో నింపింది. ఇక ప్రతి ఏడాది సీజన్‌ ముగింపు సమయంలో టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన యువ క్రికెటర్‌కు ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఇస్తారన్న సంగతి తెలిసిందే.

టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ సహా అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ తదితర భారత ఆటగాళ్లు ఈ అవార్డు అందుకున్నారు. ఇక గత రెండు సీజన్లలో దేవ్‌దత్‌ పడిక్కల్‌(2020), రుతురాజ్‌ గైక్వాడ్‌(2021) వరుసగా ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచారు. అదే విధంగా ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక విదేశీ ప్లేయర్‌గా ముస్తాఫిజుర్‌ రెహమాన్‌(2016) తన పేరును పదిలం చేసుకున్నాడు.

ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఆయుష్‌ బదోని, తిలక్‌ వర్మ, సాయి సుదర్శన్‌, అనూజ్‌ రావత్‌ తదితర ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా ఈ ఏడాది ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా ఎవరు నిలుస్తారన్న అంశంపై అంచనా వేశాడు.

ఈ మేరకు క్రిక్‌ట్రాకర్‌ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ ఈ ఏడాదితో ఐపీఎల్‌ను మొదలుపెట్టిన ఆటగాళ్లనే పరిగణనలోకి తీసుకుంటాను. తిలక్‌ వర్మ బాగా ఆడుతున్నాడు. పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సైతం రాణిస్తున్నాడు. అయితే అతడు ఎప్పటి నుంచో ఆడుతున్నాడు కాబట్టి పక్కన పెడుతున్నా. నా అభిప్రాయం ప్రకారం ఆయుష్‌ బదోని ఈసారి ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా నిలుస్తాడు’’ అని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బదోని.. 8 మ్యాచ్‌లలో కలిపి 134 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 54. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 41 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేగాక ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడతున్న అతడు ఇప్పటి వరకు 272 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌-2022లో ముంబై బ్యాటర్లలో ఇప్పటి వరకు అతడే టాప్‌ స్కోరర్‌ కావడం విశేషం. కాగా మెగా వేలం-2022లో భాగంగా లక్నో బదోనిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేయగా.. ముంబై తిలక్‌ కోసం ఏకంగా 1.7 కోట్లు ఖర్చు చేసింది.

చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్‌.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..!

Poll
Loading...
మరిన్ని వార్తలు