DC VS RCB: కోవిడ్‌ పరీక్షల్లో ఢిల్లీ ఆటగాళ్లంతా పాస్‌..!

16 Apr, 2022 13:12 IST|Sakshi
Photo Courtesy: IPL

జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌ కోవిడ్‌ బారిన పడటంతో బిక్కుబిక్కుమంటూ హోటల్‌ రూమ్స్‌కే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ సభ్యులకు ఊరట కలిగించే వార్త తెలిసింది. ఫర్హాట్‌కు సన్నిహితంగా ఉన్నవారితో పాటు డీసీ బృంద సభ్యులందరికీ నిన్న (శుక్రవారం) జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఫర్హాట్‌ నుంచి మహమ్మారి ఎవరికీ వ్యాపించలేదని, ప్రస్తుతానికి ఆటగాళ్లందరూ సేఫ్‌గానే ఉన్నారని, వారికి శనివారం మరోసారి కోవిడ్‌ టెస్ట్‌లు చేయించామని, అందులోనూ అందరికీ నెగిటివ్‌గా తేలిందని డీసీ బృందంలోని కీలక వ్యక్తి జాతీయ మీడియాకు వెల్లడించాడు. 


కోవిడ్‌ బారిన పడిన ఫర్హాట్‌లో కూడా ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆయన పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం సైతం పరోక్షంగా దృవీకరించింది. ఇవాళ (ఏప్రిల్‌ 16) ఆర్సీబీతో సమరానికి సిద్ధమంటూ తమ ఆటగాళ్ల రికార్డులను, ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. డీసీ క్యాంప్‌ నుంచి కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి బ్యాడ్‌ న్యూస్‌ వినిపించకపోవడంతో బీసీసీఐ సైతం స్పందించింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం యధాతథంగా జరుగుతుందని పేర్కొంది. 

ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా ఢిల్లీ, ఆర్సీబీ జట్లు ఇవాళ రాత్రి 7:30 గంటలకు తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో డీసీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలైంది. ప్రస్తుతానికి ఆ జట్టు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఢిల్లీ కంటే ఓ ప్లేస్‌ ముందుంది. ఆర్సీబీ 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రంగంలోకి దిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు