Tilak Varma: తిలక్‌ వర్మతో స్నేహం దేవుడిచ్చిన గొప్ప బహుమతి! మేమిద్దరం కలిసి..

6 Jul, 2022 20:52 IST|Sakshi
తిలక్‌ వర్మ- డెవాల్డ్‌ బ్రెవిస్‌(PC: IPL/BCCI)

అండర్‌-19 ప్రపంచకప్‌-2022 టోర్నీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌. ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బేబీ ఏబీడీని.. ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మెగా వేలం-2022లో భాగంగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది. 

ఈ క్రమంలో ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో అతడు 7 ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేశాడు. అయితే, ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈసారి మాత్రం పద్నాలుగింటికి కేవలం 4 మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే, బ్రెవిస్‌కు మాత్రం పలువురు మేటి క్రికెటర్ల సలహాలతో పాటు కొంతమంది స్నేహితులూ దొరికారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణంలోని జ్ఞాపకాలు పంచుకున్నాడు.

‘‘ఇంతకంటే గొప్ప జట్టు ఉంటుందని నేను అను​కోను.. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. దిగ్గజాలతో కలిసి ఆడటం గొప్ప అనుభవం. నా ఆటను మెరుగుపరుచుకునే ఎన్నో సలహాలు నాకు లభించాయి’’ అని బ్రెవిస్‌ పేర్కొన్నాడు.

దేవుడిచ్చిన వరం
ఇక హైదరాబాదీ బ్యాటర్‌, ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మతో స్నేహం గురించి చెబుతూ.. ‘‘నాకు అక్కడ ఓ స్పెషల్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. తనతో స్నేహం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తాను. 

ఈ స్నేహబంధం నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. నాకోసం తిలక్‌ అన్ని వేళలా అండగా నిలబడతాడు’’ అని బేబీ ఏబీడీ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘మేము ఇద్దరం ఒకరినొకరం సపోర్టు చేసుకుంటాం. మాకు కాస్త హాస్య చతురత ఎక్కువ. ఒకరినొకరం ప్రాంక్‌ చేసుకోవడమే కాదు.. సహచర ఆటగాళ్లను కూడా ఆటపట్టించేవాళ్లం.

A post shared by Mumbai Indians (@mumbaiindians)

బస్సు ప్రయాణాల్లోనూ మా అల్లరికి అంతే ఉండేది కాదు. వేకువజామునా.. లేదంటే అర్ధరాత్రులు అనే తేడా లేకుండా ఇద్దరం కలిసి నెట్‌ఫ్లిక్స్‌ చూసేవాళ్లం’’ అంటూ తిలక్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలను బ్రెవిస్‌ గుర్తు చేసుకున్నాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఐపీఎల్‌-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే.

చదవండి: Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్‌


 

A post shared by Tilak Varma (@tilakvarma9)

మరిన్ని వార్తలు