IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది

14 May, 2022 09:25 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శుక్రవారం ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ఒక పిల్లి అనుకోని అతిథిలా వచ్చింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. అయితే సదరు పిల్లిగారు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మరి ఆటకు ఎందుకు విరామం అనుకుంటున్నారా.. ఆ పిల్లి సైట్‌స్క్రీన్‌ మీద దర్జాగా కూర్చొని మ్యా్‌చ్‌ వీక్షించింది.

పిల్లి జాలీగా ఎంజాయ్‌ చేసినప్పటికి.. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు సైట్‌స్క్రీన్‌ ఎదురుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైట్‌స్ర్కీన్‌ నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగిన బ్యాట్స్‌మన్‌ తన ఫోకస్‌ కోల్పోతుంటాడు. సరిగ్గా డుప్లెసిస్‌ను కూడా ఇదే విషయం ఇబ్బంది పెట్టింది. విషయాన్ని అంపైర్‌కు చేరవేయగా.. మ్యాచ్‌ నిలిపివేసి సిబ్బందికి చెప్పి పిల్లిగారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన ఆర్‌సీబీ తొలి ఓవర్‌ తర్వాత  చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ అభిమానులు.. మైదానంలోకి రాకుండానే ఎంత ఇబ్బంది పెట్టింది... దీని దుంపతెగ.. పాడుపిల్లి ఎంత పని చేసింది అంటూ కామెంట్స్‌ చేశారు.

మ్యాచ్‌ విషయానికి వస్తే ప్లేఆఫ్‌ అవకాశాలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ గర్జించింది. ఓపెనర్‌గా బెయిర్‌ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్‌స్టోన్‌(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పంజాబ్‌ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్‌వెల్‌  35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం!

Kagiso Rabada: టి20 క్రికెట్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

IPL-2022 No.2 యువ ఆటగాళ్లు

మరిన్ని వార్తలు