IPL 2022 Eliminator LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా? నిలిచేది ఎవరు?

25 May, 2022 11:32 IST|Sakshi
లక్నో , ఆర్సీబీ జట్లు(PC: IPL/BCCI)

IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్‌-2022 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. టైటిల్‌ రేసులో నిలిచేందుకు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బుధవారం(మే 25) లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య పోటీ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌-2లో రాజస్తాన్‌తో తలపడనుంది.

మరి ఈ కీలక పోరుకు సిద్ధమవుతున్న లక్నో, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్‌ వాతావరణం, తుది జట్ల అంచనా, ముఖాముఖి పోరులో పైచేయి ఎవరిది అన్న విషయాలు గమనిద్దాం.

ఐపీఎల్‌ 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌: లక్నో సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
మే 25(బుధవారం) రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం

పిచ్‌ వాతావరణం: బంతి ఎక్కువగా బౌన్స్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక బెంగాల్‌, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం లేదంటే సాయంత్ర వేళ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్ద్రత ఎక్కువగా ఉన్నందున మంచు కీలక పాత్ర పోషించే ఛాన్స్‌ ఉంది. 

తుదిజట్ల అంచనా:
లక్నో సూపర్‌ జెయింట్స్‌: క్వింటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), ఎవిన్‌ లూయీస్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, మార్కస్‌ స్టొయినిస్‌, జేసన్‌ హోల్డర్‌, క్రిష్ణప్ప గౌతమ్‌, మోహ్సిన్‌ ఖాన్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయి

గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(140 నాటౌట్‌)తో పాటు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో ఉండటం లక్నోకు కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్‌ విభాగంలో కృనాల్‌, రవి బిష్ణోయి, గౌతమ్‌, స్టొయినిస్‌ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆసక్తికర అంశం: ఐపీఎల్‌-2022లో పవర్‌ప్లేలో మొత్తంగా లక్నో 23 వికెట్లు కోల్పోయింది. ఇక లీగ్‌ దశలో ఓడిన ఐదు మ్యాచ్‌లలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో రెండు, రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో రెండు, ఆర్సీబీ చేతిలో ఒకటి ఉండటం విశేషం. 

రాయల్‌ చాలెంజర్స్‌ తుది జట్టు అంచనా:
విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌(కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తిక్‌, మహిపాల్‌ లామ్రోర్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌/ఆకాశ్‌ దీప్‌, సిద్దార్థ్‌ కౌల్‌/మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌.

ముఖాముఖి పోరులో:
ఐపీఎల్‌-2022లో భాగంగా 31వ మ్యాచ్‌ ఆర్సీబీ, లక్నో మధ్య జరిగింది. ఇందులో డుప్లెసిస్‌ బృందం 18 పరుగుల తేడాతో గెలుపొంది లక్నోపై పైచేయి సాధించింది.

చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!
చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్‌లో సంజు శాంసన్‌ చెత్త రికార్డు.. తొలి కెప్టెన్‌గా..!

మరిన్ని వార్తలు