IPL 2022: సమస్య బయటపెట్టిన మాజీ క్రికెటర్‌.. ముంబై  ఓటములకు బ్రేక్‌ పడేనా!

10 Apr, 2022 16:38 IST|Sakshi
Courtesy: IPL Twitter

ముంబై ఇండియన్స్‌.. ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌. బలమైన నాయకత్వం.. అంతకుమించి బలమైన ఆటగాళ్లు.. వెరసి లీగ్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్‌ సాధించిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. అలాంటి ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మాత్రం చతికిలపడుతోంది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూసిన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

అయితే ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలో ఓటములు పలకరించినప్పటికి ఆ తర్వాత కోలుకొని చాంపియన్స్‌గా నిలిచిన దాఖలాలు ఉన్నాయి. 2015లో ముంబై ఇండియన్స్‌ పరిస్థితి దాదాపు ఇదే. అప్పుడు కూడా వరుసగా మూడు పరాజయాలు మూటగట్టుకున్నప్పటికి ఆ తర్వాత విజృంభించి చాంపియన్స్‌గా అవతరించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకు ముంబై బౌలింగ్‌ ఫేలవంగా ఉండడమే కారణం. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు.  


Courtesy: IPL Twitter
''బుమ్రా మినహా మరో నాణ్యమైన బౌలర్‌ కనిపించడం లేదు. మెగావేలంలో మంచి ధర పలికిన జోప్రా ఆర్చర్‌ వచ్చే సీజన్‌లోనే ఆడనున్నాడు. మిగతావారిలో చూసుకుంటే బాసిల్‌ థంపి, జైదేవ్‌ ఉనాద్కట్‌, డేనియల్‌ సామ్స్‌, టైమల్‌ మిల్స్‌.. చెప్పుకోవడానికి ఉన్నప్పటికి పెద్దగా రాణించింది లేదు.  దీంతో బౌలింగ్‌ భారమంతా బుమ్రాపైనే పడుతోంది. గతంలో ముంబై పరిస్థితి ఇలా లేదు. మలింగ, మిచెల్‌ మెక్లీగన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.. ఇలా ఎవరో ఒక విదేశీ బౌలర్‌ ప్రతీసారి అండగా ఉండడం కలిసొచ్చింది. ఇప్పుడు అలాంటి నిఖార్సైన బౌలర్‌ కనిపించడం లేదు. అదే ముంబై కెప్టెన్‌కి తలనొప్పిగా మారింది.

ముంబై బ్యాటింగ్‌ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ రాణిస్తుండడం సానుకూలాంశం. రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్‌ కూడా రాణిస్తే బ్యాటింగ్‌లో ముంబైకి తిరుగులేదు. ఇక మురుగన్‌ అశ్విన్‌ స్పిన్‌ బాధ్యతలు సమర్థంగానే నిర్వర్తిస్తున్నాడు. హోం గ్రౌండ్‌ అడ్వాంటేజీ అతనికి సానుకూలంగా మారింది. వచ్చే మ్యాచ్‌లోనైనా ముంబై రాత మారుతుందేమో చూడాలి.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌(ఏప్రిల్‌ 13) ఆడనుంది.

చదవండి: IPL 2022: ముంబై మళ్లీ ఓడింది! ఆర్సీబీ హ్యాట్రిక్‌ కొట్టింది!

మరిన్ని వార్తలు