IPL 2022 CSK Vs RCB: థర్డ్‌ అంపైర్‌కు మతి భ్రమించిందా..?

12 Apr, 2022 21:06 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కోహ్లి ఔట్‌ విషయంలో ఫ్యాన్స్‌ చేతిలో మొట్టికాయలు తిన్న థర్డ్‌ అంపైర్‌.. తాజా చర్యతో మరోసారి అడ్డంగా దొరికిపోయాడు.

విషయంలోకి వెళితే.. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ హాజిల్‌వుడ్‌ వేశాడు. ఓవర్‌ నాలుగో బంతిని హాజిల్‌వుడ్‌ కాస్త హై లెంగ్త్‌లో వేశాడు. బంతి రుతురాజ్‌ బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్ల పైనుంచి తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. దీంతో హాజిల్‌వుడ్‌ అప్పీల్‌ చేయగా అంపైర్ ఔట్‌ ఇచ్చాడు. అయితే రుతురాజ్‌ రివ్యూకు వెళ్లాడు. ఇక్కడే ట్విస్ట్‌ మొదలైంది. థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్న యశ్వంత్‌ బర్డే రుతురాజ్‌ క్యాచ్‌ ఔటేమోనని భ్రమ పడ్డాడు. మొదట ఆ యాంగిల్‌లోనే బంతిని పరిశీలించాడు. బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదని చెప్పాడు.

అయితే ఫీల్డ్‌ అంపైర్‌ తాను ఎల్బీకి రిఫర్‌ చేశానని.. క్యాచ్‌ ఔట్‌కు కాదని మరోసారి గుర్తు చేశాడు. దీంతో నాలుక కరుచుకున్న అంపైర్‌ క్షమాపణ కోరి ఎల్బీ రిఫరల్‌ను పరిశీలించాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదు.. మిడిల్‌ స్టంప్‌ను గిరాటేసినట్లు చూపించడంతో రుతురాజ్‌ అవుట్‌ అని ప్రకటించాడు. మొత్తానికి థర్డ్‌ అంపైర్‌ హైడ్రామా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''థర్ఢ్‌ అంపైర్‌కు మతి భ్రమించిందా'' అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు