Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం!

14 May, 2022 08:33 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఆర్‌సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి భారీ స్కోరు చేయడంలో మరోసారి విఫలమయ్యాడు. అసలే గోల్డెన్‌ డక్‌లతో ఇబ్బంది పడుతున్న కోహ్లి మరోసారి ఎక్కడ ఆ ఫీట్‌ రిపీట్‌ చేస్తాడేమోనని ఫ్యాన్స్‌ భయపడ్డారు. అయితే శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు.  సీఎస్‌కేతో మ్యాచ్‌ మినహా మరో అర్థసెంచరీ లేని కోహ్లి ఈసారైనా మెరుస్తాడని అనుకుంటే మళ్లీ తనదైన నిర్లక్ష్యంతో వికెట్‌ పారేసుకున్నాడు.

రబాడ బౌలింగ్‌లో రాహుల్‌ చహర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌ బాట పట్టిన కోహ్లి.. ఆకాశంవైపు చూస్తూ ''దేవుడా ఏంటిది అన్నట్లుగా'' ఏదో అనుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోహ్లిని ట్రోల్‌ చేశారు. ''అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం.. సీజన్‌ మొత్తం ఇలాగే ఆడుతూ ఉండు.. టీమిండియాలో నీ ప్లేస్‌ పోవడం ఖాయం.. ఔటైన ప్రతీసారి ఆకాశంవైపు చూడకుండా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడితే బాగుంటుంది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఒకప్పుడు పరుగులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే కోహ్లి ఇప్పుడు మాత్రం రన్స్‌ రాబట్టడంలో నీరుగారిపోతున్నాడు. ఇదే కోహ్లి 2016 ఐపీఎల్‌లో దాదాపు వెయ్యి పరుగులు(936 పరుగులు) సాధించినంత పనిచేశాడు. అప్పటి కోహ్లి అసలు ఏమయ్యాడో అర్థం కావడం లేదు. టీమిండియా కెప్టెన్‌గా.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే కోహ్లి బాగా రాణించాడు. ఏ ఆటగాడైనా కెప్టెన్సీ బాధ్యతలు లేకుంటే స్వేచ్చగా ఆడడం చూస్తాం.. కానీ కోహ్లి విషయంలో అది రివర్స్‌ అయినట్లు కనబడుతుంది. ఇలాగే కొనసాగితే.. రానున్న టి20 ప్రపంచకప్‌ 2022లో కోహ్లికి టీమిండియా తుది జట్టులో చోటు దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ప్లేఆఫ్‌ అవకాశాలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ గర్జించింది. ఓపెనర్‌గా బెయిర్‌ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్‌స్టోన్‌(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పంజాబ్‌ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్‌వెల్‌  35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Kagiso Rabada: టి20 క్రికెట్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు