IPL 2022 Winner: క్రెడిట్‌ మొత్తం ఆయనకేనన్న హార్దిక్‌.. అంతా అబద్ధం! కాదు నిజమే!

30 May, 2022 14:26 IST|Sakshi
ఆశిష్‌ నెహ్రా, హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

IPL 2022 Winner GT: ‘‘మొదటి సీజన్‌లోనే మనం సిక్సర్‌ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం. నిజంగా ఇది చాలా బాగుంది కదా’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. తమ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాతో ముచ్చటిస్తూ ఐపీఎల్‌-2022లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు.

కాగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ ఆరంభం నుంచి ఆధిక్యం కనబరిచి.. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుపొంది ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో తమ మొదటి సీజన్‌లోనే టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆశిష్‌ నెహ్రా- హార్దిక్‌ పాండ్యా సరదాగా ముచ్చటించారు.

ఈ క్రమంలో ఆశిష్‌ నెహ్రాపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ‘‘మాలో మొదట ప్రాక్టీసుకు వెళ్లేది నెహ్రా. 20 నిమిషాల సమయం ఉన్నా సరే ప్రాక్టీసు అయిపోయినా మళ్లీ మళ్లీ బ్యాటింగ్‌ చేయమంటారు. నిజానికి ఈ క్రెడిట్‌ మొత్తం ఆయనకే దక్కుతుంది. అంకితభావంతో పనిచేశారు. మాలో ప్రతి ఒక్కరు హార్డ్‌వర్క్‌ చేసేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, హార్దిక్‌ పాండ్యా మాటలకు మొహమాటపడిన నెహ్రా.. ‘‘ఇదంతా అబద్ధం’’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అబద్ధం కాదు నిజమే!
హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, టీమ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకి వేలం రోజు నుంచి గుజరాత్‌ విజేతగా నిలిచే క్రమంలో తమదైన రీతిలో జట్టును తీర్చిదిద్దారు. లీగ్‌ సాగినంత కాలం జట్టు యాజమాన్యం ‘సీవీసీ క్యాపిటల్స్‌’ నుంచి ఒక్క వ్యక్తి కూడా ‘చిత్రం’లో ఎక్కడా కనిపించలేదు. అంతా వీరిద్దరికే అప్పగించారు. బ్యాటింగ్‌ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ ఉన్నా... నిర్ణయాత్మక పాత్ర పై ఇద్దరిదే. చాలా మంది కోచ్‌లతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో నెహ్రా పని చేశాడు.

ఆధునిక కోచ్‌ల తరహాలో చేతిలో పెన్నూ, పేపర్‌తో నోట్స్‌ రాసుకోవడం, ప్రతీ దానిని విశ్లేషణాత్మకంగా చూడటం అతను ఎప్పుడూ చేయలేదు. తాను చెప్పదల్చుకున్న అంశంపై డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఒకే ఒక స్పష్టతనిచ్చేయడం, అమలు చేసే అంశాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లకే వదిలేసి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సరిగ్గా చూస్తే గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌లో ఫలానా ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడని ఒక్కరిని కూడా వేలెత్తి చూపలేం!

వేలంలో 37 మంది పేర్లు వచ్చినప్పుడు గుజరాత్‌ పోటీ పడినా... చివరకు తమ అవసరాలను అనుగుణంగా కచ్చితంగా ఎంచుకుంటూ 20 మందినే తీసుకోవడంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ సోలంకిదే ముఖ్య భూమిక. ఆటతో పాటు అన్నీ కలిసొచ్చిన గుజరాత్‌ సొంత అభిమానుల సమక్షంలో ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోగలిగింది. 

ఐపీఎల్‌-2022: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌
►టాస్‌: రాజస్తాన్‌
►రాజస్తాన్‌ స్కోరు: 130/9 (20)
►గుజరాత్‌ స్కోరు: 133/3 (18.1)
►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్‌-2022 చాంపియన్‌గా గుజరాత్‌
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు)  

చదవండి 👇
IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్‌ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!
Hardik Pandya-Natasa Stankovic:'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'

A post shared by IPL (@iplt20)

మరిన్ని వార్తలు