IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్‌ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్‌ పాండ్యా

29 Mar, 2022 08:41 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL)

IPL 2022- Gujarat Titans Hardik Pandya Comments: ‘‘ఈ మ్యాచ్‌, ఇందులో గెలిచిన తీరు మాకు చాలా పాఠాలు నేర్పించింది. నిజానికి షమీ తన అద్భుత ప్రదర్శనతో మాకు శుభారంభం అందించాడు. ఇకపై నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఒత్తిడిని జయించగలను.. కాబట్టి మిగతా వాళ్లకు కాస్త స్వేచ్ఛగా ఆడే వెసలుబాటు ఉంటుంది. 

ఎవరో ఒకరి మీద ఆధారపడటం కాకుండా మేమంతా సమష్టి ప్రదర్శనతో జట్టుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మనోహర్‌ రూపంలో ప్రతిభావంతుడైన ఆటగాడు మాకు దొరికాడు. భవిష్యత్తు ఆశాకిరణం తను. ఇక తెవాటియా ఒక సంచలనం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు.

ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో తన సోదరుడు కృనాల్‌ పాండ్యా తనను అవుట్‌ చేశాడని, తానేమో మ్యాచ్‌ గెలిచానని.. అందుకే తమ కుటుంబం మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉందని చమత్కరించాడు. కాగా ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ షమీ(3 వికెట్లు) బంతితో రాణించగా.. రాహుల్‌ తెవాటియా(40 పరుగులు- నాటౌట్‌) జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు సాధించాడు. దీంతో లక్నోపై గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన హార్దిక్‌ పాండ్యా పైవిధంగా స్పందించాడు. 

ఇక హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్యా లక్నో జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుత సీజన్‌లో తొలిసారిగా వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులుగా ఆడిన తొలి మ్యాచ్‌లో కృనాల్‌ హార్దిక్‌ను అవుట్‌ చేశాడు. తాను మాత్రం 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు