IPL 2022 GT Vs LSG: అతడు మంచి వన్డే ప్లేయర్‌ మాత్రమే.. టీ20 క్రికెట్‌లో అలా కుదరదు: సెహ్వాగ్‌ విసుర్లు

29 Mar, 2022 12:57 IST|Sakshi

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించాడు. టీ20 ఫార్మాట్‌లో రాణించాలంటే హిట్టింగ్‌ ఆడాల్సి ఉంటుందని, వాళ్లే విజయవంతమవుతారని పేర్కొన్నాడు. గిల్‌ ఈ విషయంపై దృష్టిసారించాలని సూచించాడు. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌తో కలిసి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే, మూడు బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దుష్మంత చమీర బౌలింగ్‌లో దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం తనొక మంచి వన్డే ప్లేయర్‌ మాత్రమే! ఎందుకంటే టీ20 క్రికెట్‌లో.. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌండరీలు బాదిన వాళ్లే విజయవంతమవుతారు. ఈ విషయాన్ని గిల్‌ గమనించాలి. అతడు దూకుడు ప్రదర్శిస్తూ అద్బుతమైన షాట్లు ఆడాల్సిన అవసరం లేదు.

సాధారణ రీతిలో ఆడినా సరే జట్టుకు శుభారంభం అందించగలడు’’ అని పేర్కొన్నాడు. ఆటను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని, స్ట్రైక్‌ రేటుపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబడితేనే ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి స్వేచ్ఛగా ఆడగలడని అభిప్రాయపడ్డాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే... లక్నోపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి గుజరాత్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో శుభారంభం చేసింది.

చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్‌ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్‌ పాండ్యా

మరిన్ని వార్తలు