IPL 2022: నిజానికి ఇది కింగ్స్‌ గేమ్‌.. ఆ ముగ్గురి వల్లే ఇదంతా: హార్దిక్‌ పాండ్యా

9 Apr, 2022 09:51 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

IPL 2022 GT Vs PBKS: ‘‘తెవాటియాకు హ్యాట్సాఫ్‌. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగి .. హిట్టింగ్‌ ఆడటం చాలా కష్టం. ముఖ్యంగా ఒత్తిడిని జయించి ఈ స్థాయిలో రాణించడం అమోఘం’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తమ జట్టు బ్యాటర్‌ రాహుల్‌ తెవాటియాపై ప్రశంసల వర్షం కురిపించాడు.  అదే విధంగా శుభ్‌మన్‌ గిల్‌(59 బంతుల్లో 96 పరుగులు), సాయి సుదర్శన్‌(30 బంతుల్లో 35) పట్టుదలగా నిలబడిన కారణంగానే తాము చివరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగామని పేర్కొన్నాడు.

వారిద్దరి మెరుగైన భాగస్వామ్యం తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని హార్దిక్‌ తెలిపాడు. కాగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఎంట్రీలోనే హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన జట్టుగా పాండ్యా సేన నిలిచింది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో తెవాటియా చివరి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన వేళ రెండు సిక్సర్లు కొట్టి జట్టుకు గుర్తుండిపోయే గెలుపును అందించాడు.

దీంతో చివరి వరకు పోరాడిన పంజాబ్‌ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. నిజానికి ఇది కింగ్స్‌ గేమ్‌. వాళ్ల పట్ల నాకు సానుభూతి ఉంది. నిజంగా బాగా ఆడారు. తెవాటియా అద్భుతంగా ఆడాడు. గిల్‌ నేనున్నాంటూ అందరికీ భరోసా ఇచ్చాడు. ఇక గిల్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పిన ఘనత సాయికి దక్కుతుంది. 

వాళ్ల వల్లే మేము చివరి వరకు పోటీలో నిలవగలిగాం. నా ఆటతీరు కూడా రోజురోజుకీ మెరుగుపడుతోంది. నిజానికి నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసేసరికి అలసిపోతున్నా. అయితే, మ్యాచ్‌ మ్యాచ్‌కు నా ఆట తీరును మెరుగుపరచుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా 27 పరుగులు చేయడంతో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ స్కోర్లు
పంజాబ్‌–189/9 (20)
గుజరాత్‌– 190/4 (20) 

చదవండి: IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత...

మరిన్ని వార్తలు