IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్‌.. అహ్మదాబాద్‌కు చలో చలో!

25 May, 2022 07:48 IST|Sakshi
రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌(PC: IPL/BCCI)

మొదటి సీజన్‌ ఐపీఎల్‌లో ఫైనల్‌ చేరిన టైటాన్స్‌

తొలి క్వాలిఫయర్‌లో 7 వికెట్లతో రాజస్తాన్‌పై గెలుపు

చెలరేగిన మిల్లర్‌ ∙రాణించిన హార్దిక్‌

బట్లర్‌ శ్రమ వృథా 

IPL 2022 GT Vs RR: కోల్‌కతా- ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోనే సరిపెట్టుకోలేదు. తమ ఆటను మరో మెట్టుకు తీసుకెళుతూ మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు చేరింది. సొంతగడ్డపై సొంత అభిమానుల సమక్షంలో అహ్మదాబాద్‌లో ఈనెల 29న తుది పోరులో తలపడేందుకు అర్హత సాధించింది.

మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌–1లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (56 బంతుల్లో 89; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా, సామ్సన్‌ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం గుజరాత్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ మిల్లర్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుకు హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మాథ్యూ వేడ్‌ (30 బంతుల్లో 35; 6 ఫోర్లు) అండగా నిలిచారు. అయితే ఓడిన రాజస్తాన్‌కు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో గెలిస్తే ఆ టీమ్‌ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.   

కీలక భాగస్వామ్యం... 
ఛేదనలో రెండో బంతికే సాహా (0) అవుట్‌ కావడం తో గుజరాత్‌కు షాక్‌ తగిలింది. అయితే గిల్, వేడ్‌ కలిసి దూకుడుగా ఆడారు. అశ్విన్‌ ఓవర్లో గిల్‌ వరు సగా 6, 4, 4 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో సమన్వయ లోపంతో గిల్‌ రనౌట్‌ కాగా, కొద్ది సేపటికే వేడ్‌ కూడా వెనుదిరిగాడు. ఈ స్థితిలో రాజస్తాన్‌ది పైచేయిగా కనిపిం చింది.

కానీ గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ చాలా ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మరోవైపు నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన మిల్లర్‌ కూడా జోరు మొదలు పెట్టడంతో టైటాన్స్‌ పని సులువుగా మారింది. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొన్నా... ప్రసిధ్‌ కృష్ణ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచి మిల్లర్‌ గెలిపించేశాడు. పాండ్యా, మిల్లర్‌ నాలుగో వి కెట్‌కు 61 బంతుల్లోనే 106 పరుగులు జోడించారు.

బట్లర్‌ మెరుపులు... 
సీజన్‌ తొలి 7 మ్యాచ్‌లలో 491 పరుగులు... ఆ తర్వాత ఒక్కసారిగా ఫామ్‌ కోల్పోయి తర్వాతి 7 మ్యాచ్‌లలో 138 పరుగులు... జోస్‌ బట్లర్‌ ఆట తీరిది! అయితే అసలు సమయంలో అతను మళ్లీ తన శైలిని అందుకొని రాజస్తాన్‌ జట్టులో తన విలువేంటో చూపించాడు.

16 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్‌ స్కోరు 127 పరుగులు కాగా, బట్లర్‌ స్కోరు 38 బంతుల్లో 39 పరుగులే! అయితే తానాడిన తర్వాతి 18 బంతుల్లో అతను 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు సాధించడం విశేషం. యశ్‌ దయాళ్‌ ఓవర్లో నాలుగు, జోసెఫ్‌ ఓవర్లో మూడు ఫోర్ల చొప్పున అతను బాదాడు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు