Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా!

25 May, 2022 09:03 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

IPL 2022 GT Enters Final- Hardik Pandya Comments: ‘‘జీవితంలో ఎన్నో విషయాల్లో సంయమనం పాటించడం నేర్చుకున్నాను. గత రెండేళ్లుగా నన్ను నేను మరింతగా మార్చుకునేలా ప్రయత్నాలు చేశాను. ఇందులో నా కుటుంబం ముఖ్యంగా నా కుమారుడు, నా కొడుకు, నా భార్య.. మా అన్న కీలక పాత్ర పోషించారు. తీవ్ర భావోద్వేగాలకు అతీతంగా పరిణతితో కూడిన జీవితం సాగించేలా ప్రోత్సహించారు.

మెరుగైన క్రికెటర్‌గా ఎదిగేలా మార్పులు తెచ్చారు. ఇప్పటికీ ఈ విజయంతో ఉప్పొంగిపోను. నేలమీదే ఉండేందుకు ప్రయత్నిస్తాను’’ అంటూ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఉద్వేగంగా మాట్లాడాడు. కాగా గత ఐపీఎల్‌ సీజన్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్‌ పాండ్యా.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నా అక్కడ కూడా విఫలమయ్యాడు. ఫిట్‌నెస్‌ లోపాలతో టీమిండియాకూ దూరమయ్యాడు.


భార్య నటాషా, కొడుకు అగస్త్యతో హార్దిక్‌ పాండ్యా

ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంఛైజీ రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. ముంబై ఇండియన్స్‌ రిలీజ్‌ చేయడంతో హార్దిక్‌ను దక్కించుకున్న గుజరాత్‌ అతడిపై నమ్మకం ఉంచి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్‌-2022తో ఎంట్రీ ఇచ్చిన ఫ్రాంఛైజీ అంచనాలు నిజం చేస్తూ హార్దిక్‌ పాండ్యా జట్టును అగ్రస్థానంలో నిలిపాడు.

అంతేకాకుండా క్వాలిఫైయర్‌-1లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం(మే 24) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిచి అరంగేట్రంలోనే ఫైనల్‌ చేరిన జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయానంతరం హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. తన చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, వారి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు.

‘‘జట్టులో ఉన్న 23 మంది ఆటగాళ్లు.. వేర్వేరు వ్యక్తిత్వాలు కలవాళ్లు. మన చుట్టూ ఉన్నవాళ్లు పాజిటివిటీతో ఉంటే మనకు కూడా బాగుంటుంది. మా విజయానికి కారణం అదే. డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లు కూడా తమ వంతు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. సమిష్టి కృషితోనే మేము ఇక్కడిదాకా వచ్చాము. ఏదేమైనా ప్రతి ఒక్కరు ఆటను గౌరవించాల్సిందే. అప్పుడే అంతా బాగుంటుంది.

రషీద్‌ ఖాన్‌ ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో.. మిల్లర్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. అదే విధంగా జట్టుకు నా సేవలు అవసరమైన ప్రతిసారీ సిద్ధంగా ఉన్నాను. బ్యాట్‌ ఝులిపించాను. నా జట్టుతో కలిసి నేను కూడా సక్సెస్‌ అందుకున్నాను. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేశారు కాబట్టే మేము ఇక్కడ ఉన్నాం’’ అని సహచర ఆటగాళ్లను హార్దిక్‌ పాండ్యా అభినందించాడు.

ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు
టాస్‌- గుజరాత్‌
రాజస్తాన్‌ రాయల్స్‌- 188/6 (20)
గుజరాత్‌ టైటాన్స్‌- 191/3 (19.3)
7 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ మిల్లర్‌(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్‌)
ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా 27 బంతుల్లో 40 పరుగులు నాటౌట్‌.. అదే విధంగా 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ పడగొట్టాడు.

చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్‌లో సంజు శాంసన్‌ చెత్త రికార్డు.. తొలి కెప్టెన్‌గా..!
చదవండి👉🏾Womens T20 Challenge: ఇదేం బౌలింగ్‌ యాక్షన్‌రా బాబు.. చూస్తే వావ్‌ అనాల్సిందే.. వీడియో వైరల్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు