IPL 2022 Final: GT vs RR Match: ఐపీఎల్‌ ఫైనల్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ పోరు

29 May, 2022 04:32 IST|Sakshi

ఆఖరి సమరం

గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ పోరు

రాత్రి గం.8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

టోర్నీలో అడుగు పెట్టిన తొలిసారే ఫైనల్‌ చేరిన జట్టు ఒకవైపు... తొలి టోర్నీలో విజేత గా నిలిచిన 14 ఏళ్లకు తుది పోరుకు అర్హత సాధించిన జట్టు మరోవైపు...పాయింట్ల పట్టిక లో కూడా టాప్‌–2లో నిలిచిన రెండు టీమ్‌లే ఆఖరి సమరంలో కూడా ప్రత్యర్థులుగా మారాయి.

ఇరు జట్ల కెప్టెన్లూ మొదటి టైటిల్‌ అందుకొని ఐపీఎల్‌ చరిత్రలో తమ పేరును సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉండగా ... అభిమానులు కూడా ఈ సమరం కోసం అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో జరగనున్న ‘మెగా’ మ్యాచ్‌లో విజేత ఎవరనేది ఆసక్తికరం.

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022లో 65వ రోజు... 74వ మ్యాచ్‌... సగటు అభిమానికి ఫుల్‌ వినోదాన్ని అందించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి పోరుకు చేరింది. నేడు జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడుతుంది. లీగ్‌ దశలో గుజరాత్‌ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్‌దే పైచేయి.

ఐపీఎల్‌ గత నాలుగు సీజన్లలో ఇలా ఫైనల్‌కు ముందు ప్రత్యర్థిపై ఏకపక్షంగా ఆధిక్యం ప్రదర్శించిన జట్టే తుది పోరులోనూ గెలిచింది. రాజస్తాన్‌ ఈసారి ఆ ట్రెండ్‌ను మారుస్తుందేమో చూడాలి. అన్నింటికి మించి లక్షకు పైగా ప్రేక్షకుల మధ్య సొంతగడ్డపై ఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోతుండటం గుజ రాత్‌కు అనుకూలాంశం. ఫైనల్లోనూ టాస్‌ కీలకం కానుంది. గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకోవచ్చు. 

ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో...
వేలం ముగిశాక గుజరాత్‌ జట్టును చూస్తే అంత భీకరంగా ఏమీ కనిపించలేదు. కానీ ఒక్కో మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ ఆ జట్టు బలం బయటపడింది. ప్రతీ మ్యాచ్‌లో వేర్వేరు ఆటగాడు సత్తా చూపిస్తూ జట్టును గెలిపిస్తూ వచ్చారు. ఒకరిపైనే ఆధారపడకుండా సమష్టితత్వంతో టీమ్‌ వరుస విజయాలు సాధించింది. లీగ్‌ దశలో 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లుగా నిలవడం జట్టులో వారి విలువేమిటో చూపించింది.

తొలి క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌ను ఓడించిన జట్టులోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దించే అవకాశం ఉంది. ఓపెనర్‌గా సాహా తన పాత్రను సమర్థంగా పోషిస్తుండగా, గిల్‌ కూడా నిలకడగా ఆడాడు. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యానే జట్టుకు పెద్ద బలం. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో కూడా రాణిస్తున్న హార్దిక్‌... కెప్టెన్‌గా కూడా తన తొలి టోర్నీలోనే ఎన్నో మెట్లు ఎక్కాడు.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చక్కటి వ్యూహాలతో అతను ఆకట్టుకున్నాడు.  ఇక మిల్లర్‌ మెరుపులేమిటో గత మ్యాచ్‌లో రాజస్తాన్‌కు అనుభవమే. బౌలింగ్‌లో కూడా టైటాన్స్‌ పటిష్టంగా ఉంది. సీనియర్‌ షమీకి తోడుగా జూనియర్‌ యశ్‌ దయాళ్‌ కూడా ఆకట్టుకున్నాడు. అన్నింటికి మించి రషీద్‌ ఖాన్‌ జట్టుకు పెద్ద బలం. కేవలం 6.73 ఎకా నమీతో 18 వికెట్లు తీసిన రషీద్‌ను గత మ్యాచ్‌లో ఎదుర్కోవడంలో రాయల్స్‌ పూర్తిగా విఫలమైంది.  

బట్లర్‌ చెలరేగితే...
రాజస్తాన్‌ జట్టును బ్యాటింగ్‌లో ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సామర్థ్యం ఇద్దరికే ఉంది. ఒకరు జోస్‌ బట్లర్, మరొకరు కెప్టెన్‌  సామ్సన్‌. కొన్ని వైఫల్యాలు ఉన్నా...సామ్సన్‌ చెలరేగుతున్నప్పుడు అతడిని అడ్డుకోవడం ప్రత్యర్థికి సాధ్యం కాదు. సీజన్‌లో అతను 147.50 స్ట్రయిక్‌రేట్‌తో 444 పరుగులు సాధించడం దీనికి సూచిక. ఇక 16 మ్యాచ్‌లలో 824 పరుగులు చేసిన బట్లర్‌ను గుజ రాత్‌ ఎలా నిలువరిస్తుందనేదానిపైనే ఆ జట్టు విజ యావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌల్ట్‌తో పాటు గత మ్యాచ్‌లో సత్తా చాటిన ప్రసిధ్‌ బౌలింగ్‌ లో కీలకం కానున్నారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు