IPL 2022: అదే నా ప్లాన్‌.. ఆల్‌రౌండర్‌గానే... పెద్దగా హడావుడి లేదు.. కెప్టెన్‌గా నా పాలసీ అదే: హార్దిక్‌ పాండ్యా

25 Jan, 2022 14:44 IST|Sakshi

హార్దిక్‌ పాండ్యా.. ఒకప్పుడు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఆటగాడు గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌-2021, టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. గాయాల బెడదతో సతమతమవుతున్న అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. అయితే, ఇప్పటికే జాతీయ జట్టులో హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ సిద్ధంగా ఉన్నాడు.

మరోవైపు శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌ కూడా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టులో చోటు సంపాదించుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తాను ప్రతిభను నిరూపించుకుని ఆల్‌రౌండర్‌గానే ఆడాలనుకుంటున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని హార్దిక్‌ పాండ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యాను వదిలేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ అతడిని ఎంపిక చేసుకుంది. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే హార్దిక్‌కు కాస్త ఊరట కలిగించే అంశం. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్‌ పాండ్యా తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘నేను ఆల్‌రౌండర్‌గానే ఆడాలనుకుంటున్నాను. గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు.

కానీ... ఆల్‌రౌండర్‌గా ఉండేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నా. నా ప్లాన్‌ అదే. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దృఢంగా ఉన్నాను. అయితే, ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.... ఒక జట్టు ఎలా ఉంటే మంచి ఫలితాలు రాబట్టగలదో నా నాయకత్వం అలాంటి సంస్కృతిని పెంపొందించగలగాలి. జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలి. 

నేను పెద్దగా హడావుడి చేయాలనుకోవడం లేదు. ప్రతి ఒక్క ఆటగాడు సొంత ఇంటిలో ఉన్నానన్న భావన కలిగించడం... వాళ్లను సౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్దగా ప్రభావం చూపుతాయి. ఒక్కసారి ఇలాంటి డ్రెస్సింగ్‌ రూం వాతావరణంలో వారు ఇమిడిపోయారంటే.. వారి శక్తియుక్తులను వెలికితీసి.. మరింత స్వేచ్ఛగా ఆడగలుగుతారు. జట్టుకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ హార్దిక్‌ పాండ్యాతో పాటు రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు