IPL 2022- SRH: టీమిండియా లీడింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు.. ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

23 May, 2022 18:19 IST|Sakshi

IPL 2022- SRH Vs PBKS: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ క్రికెటర్‌, టీమిండియా ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌పై భారత జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని, అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతాడని కొనియాడాడు. తను ఆటను తేలికగా తీసుకోడని, సీరియస్‌ క్రికెటర్‌ అని కితాబిచ్చాడు. ఐపీఎల్‌-2022లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

లీగ్‌ ముగింపు దశలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆదివారం(మే 22) పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 25 పరుగులు చేశాడు. అదే విధంగా 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ టీమిండియా లీడింగ్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు. భవిష్యత్తు ఆశాకిరణం అతడే. 

జడేజా ఫిట్‌గా ఉండి ఇంకొన్నేళ్లు ఆడగలిగినా.. అక్షర్‌ పటేల్‌ జట్టులో ఉన్నప్పటికీ.. వాషింగ్టన్‌ సుందర్‌ ప్రీమియర్‌ ఆల్‌రౌండర్‌ అవుతాడు. అన్ని ఫార్మాట్లలోనూ తన మార్కు చూపిస్తాడు. అతడు సీరియస్‌ క్రికెటర్‌. యువకుడే అయినప్పటికీ ఆట పట్ల అతడికి ఉన్న అవగాహన అమోఘం. ముఖ్యంగా షాట్‌ సెలక్షన్‌ విషయంలో తను తానే సాటి. అయితే, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. 

రానున్న మూడేళ్లలో టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌ అవుతానని అద్దంలో చూసుకుంటూ తనను తాను చెప్పుకోగల అర్హత కలిగిన ఏకైక ఆటగాడు అతడు’’ అంటూ వాషింగ్టన్‌ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్‌-2022లో వాషింగ్టన్‌ సుందర్‌ సన్‌రైజర్స్‌ తరఫున ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 101 పరుగులు చేశాడు.

అత్యధిక స్కోరు 40. 8 ఇన్నింగ్స్‌లలో అతడు పడగొట్టిన వికెట్ల సంఖ్య 6. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు సుందర్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పంజాబ్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

చదవండి👉🏾IND Vs SA: డీకేను సెలక్ట్‌ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు
చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్‌

మరిన్ని వార్తలు