IPL 2022- 1st Week: తొలివారంలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే!

2 Apr, 2022 15:39 IST|Sakshi

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభమై వారం రోజులు దాటింది. ఏప్రిల్‌ 1 నాటికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లో స్కోరింగ్‌ మ్యాచ్‌లతో పాటు.. ఆఖరి ఓవర్‌ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కొంతమంది ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు.

భారీ అంచనాలతో ఐపీఎల్‌-2022 బరిలో దిగిన వారు ఆరంభ మ్యాచ్‌లలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం.

రుతురాజ్‌ గైక్వాడ్‌
ఐపీఎల్‌-2021 సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడు. ఈ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్‌ ఏకంగా 635 పరుగులు  సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీలు విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. 

ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో ఐపీఎల్‌-2022లో అడుగుపెట్టాడు. కానీ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో డకౌట్‌ అయిన రుతురాజ్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు.

వెంకటేశ్‌ అయ్యర్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున గత సీజన్‌ రెండో అంచెలో అదరగొట్టాడు ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడు. తద్వారా టీమిండియాలో చోటు ద​క్కించుకోగలిగాడు. ఇక ఐపీఎల్‌-2021 ప్రదర్శన నేపథ్యంలో కేకేఆర్‌ అతడిని 8 కోట్లు పెట్టి రిటైన్‌ చేసుకుంది. 

అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ యువ ఆల్‌రౌండర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీఎస్‌కేతో మొదటి మ్యాచ్‌లో ఈ ఓపెనర్‌ 16 పరుగులు చేశాడు. ఆర్సీబీపై 10, పంజాబ్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేదు.

అనూజ్‌ రావత్‌
ఆర్సీబీ యువ ఆటగాడు సైతం ఆరంభ మ్యాచ్‌లలో తేలిపోయాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఘనంగానే ఇన్నింగ్స్‌ ఆరంభించినా రాహుల్‌ చహర్‌కు దొరికిపోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. 21 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. 

ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి అనూజ్‌ రావత్‌ సగటు స్కోరు 10.5.

మనీష్‌ పాండే
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆటగాడు మనీశ్‌ పాండేకు ఈ సీజన్‌లో మంచి ఆరంభం దక్కలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో మొత్తం కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 5, గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 6 పరుగులు సాధించాడు.

నికోలస్‌ పూరన్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎన్నో ఆశలతో నికోలస్‌ పూరన్‌ను మెగా వేలంలో కొనుగోలు చేసింది. గత సీజన్‌లో విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. ఇక ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించిన ఈ విండీస్‌ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌.. ఐపీఎల్‌-2022ను ఘనంగా ఆరంభించలేకపోయాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయిన పూరన్‌.. పూర్‌ పర్ఫామెన్స్‌తో అభిమానులను నిరాశపరిచాడు.

లియామ్‌ లివింగ్‌స్టోన్‌
మెగా వేలం-2022లో భాగంగా 11.5 కోట్ల భారీ ధర చెల్లించి పంజాబ్‌ కింగ్స్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఘనంగా తన ఆగమనాన్ని చాటలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులు చేశాడు. 

రాజ్‌ బవా
భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ రాజ్‌ బవా ఐసీసీ మెగా ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

మిడిలార్డర్‌లో భాగమైన ఈ యువ ఆటగాడు.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌ అయి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 14వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాజ్‌ బవా విఫలమయ్యాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు సాధించగలిగాడు. 

డానియెల్‌ సామ్స్‌
ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ డానియెల్‌ సామ్స్‌ 57 పరుగులు సమర్పించుకున్నాడు.

ముఖ్యంగా 18వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు మొత్తంగా 24(6,1,6,4,1,6) పరుగులు సాధించి తమ జట్టుకు విజయం అందించారు. హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడని భావించిన ముంబై యాజమాన్యానికి ఆరంభ మ్యాచ్‌లో విఫలమై షాకిచ్చాడు డానియెల్‌ సామ్స్‌.

జస్‌ప్రీత్‌ బుమ్రా
టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను 12 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్‌ రిటైన్‌ చేసుకుంది. జట్టుకు ప్రధానమైన ఈ బౌలర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన బుమ్రా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, ఆరంభం ఘనంగా లేకపోయినప్పటికీ ఈ అనువజ్ఞుడైన ఆటగాడు తప్పక రాణించగలడని విశ్లేషకుల అభిప్రాయం.

నాథన్‌ కౌల్టర్‌నైల్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. 61 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, ఈ విజయంలో నాథన్‌ తన వంతు పాత్ర పోషించలేకపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్‌ వేసిన ఈ బౌలర్‌ ఏకంగా 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 

శివమ్‌ మావి
కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు శివమ్‌ మావి. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అతడు.. 4 ఓవర్లు బౌలింగ్‌ వేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. 

ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జట్టులో స్థానం కోల్పోయిన శివమ్‌ మావి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. అయితే, రెండు ఓవర్లలోనే 39 పరుగులు ఇచ్చుకుని విఫలమయ్యాడు. అయితే, ఒక వికెట్‌ మాత్రం తీయగలగడం గమనార్హం.

అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ రానున్న మ్యాచ్‌లలో తమదైన శైలిలో రాణించి అభిమానులను ఆకట్టుకోవాలని కోరుకుందాం.

మరిన్ని వార్తలు