IPL 2022 CSK Vs MI: అప్పుడూ.. ఇప్పుడూ ధోని వలలో చిక్కిన పొలార్డ్‌! ఇగోకు పోయి బొక్కబోర్లా పడి..

22 Apr, 2022 13:46 IST|Sakshi
ధోని, పొలార్డ్‌(PC: IPL/BCCI)

IPL 2022 CSK Vs MI- MS Dhoni- Kieron Pollard: ముంబై ఇండియన్స్‌ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్‌ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని సూచించాడు. కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఆఖరి బంతికి ధోని ఫోర్‌ బాదడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా ఏడో పరాజయాన్ని​ మూటగట్టుకుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(0), ఇషాన్‌ కిషన్‌(0) పూర్తిగా విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌(32), తిలక్‌ వర్మ(51) కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో 9 బంతుల్లో  ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ బాది 14 పరుగులు సాధించిన పొలార్డ్‌ భారీ స్కోరు చేసేలా కనిపించాడు.

అయితే, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు చెన్నై మాజీ కెప్టెన్‌ ధోని ఫీల్డ్‌ సెట్‌ చేశాడు. తలైవా మాస్టర్‌ ప్లాన్‌లో చిక్కుకున్న ఈ భారీ హిట్టర్‌ మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మహీశ్‌ సంధించిన క్యారమ్‌ బాల్‌ను తేలికగా తీసుకుని డీప్‌లో ఉన్న దూబేకు దొరికిపోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ధోనికి కౌంటర్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇగోకు పోయి బొక్కబోర్లా పడ్డాడు.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘స్ట్రెయిట్‌ షాట్లు ఆడటమే పొలార్డ్‌ బలం. అందుకే అక్కడ వాళ్లు(సీఎస్‌కే) ఫీల్డర్‌ను పెట్టారు. కాబట్టి పొలార్డ్‌ కాస్త ఆచితూచి ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్‌ షాట్‌ ఆడేందుకే మొగ్గు చూపాడు. మూల్యం చెల్లించాడు. మంచి ఇన్నింగ్స్‌ ఆడుతూ.. మ్యాచ్‌లు గెలిపిస్తూ కీలక ప్లేయర్‌గా అవతరించిన తర్వాత.. ‘‘మీరు నాకోసం వల పన్నారు కదా! చూడండి నా బలమేమిటో చూపిస్తా’’ అన్నట్లుగా పొలార్డ్‌ వ్యవహరించాడు. 

ఫలితంగా వికెట్‌ సమర్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఐపీఎల్‌-2010 ఫైనల్లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో పొలార్డ్‌ అవుటైన సంగతి తెలిసిందే. ఆల్బీ మోర్కెల్‌కు బంతిని ఇచ్చిన ధోని మిడాఫ్‌లో మాథ్యూ హెడెన్‌ ఫీల్డర్‌గా పెట్టగా.. పొలార్డ్‌ అతడికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో ముంబైపై 22 పరుగుల తేడాతో గెలుపొందిన ధోని సేన టైటిల్‌ ఎగురేసుకుపోయింది.

చదవండి👉🏾: MS Dhoni IPL Record: ఐపీఎల్‌లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్‌ను వెనక్కి నెట్టి..

మరిన్ని వార్తలు