Jos Buttler: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్‌ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్‌ భావోద్వేగం

28 May, 2022 13:31 IST|Sakshi
రాజస్తాన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌(PC: IPL/BCCI)

IPL 2022- Jos Buttler: ‘‘ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగాను. అయితే, యాజమాన్యం, సహచర ఆటగాళ్ల ప్రోత్సాహంతో ఇక్కడి దాకా వచ్చాను. సమిష్టి కృషితో ఫైనల్స్‌లో ప్రవేశించాం. కుమార సంగక్కర, ట్రెవార్‌ పెన్నీతో సంభాషణలు ఎప్పటికీ మరచిపోలేను’’ అని క్వాలిఫైయర్‌-2 హీరో, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ అన్నాడు. 

ఐపీఎల్‌-2022 మధ్యలో కాస్త తడబడ్డానని, అప్పుడు ఒత్తిడికి గురయ్యానన్న బట్లర్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పుంజుకోవడంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నానని పేర్కొన్నాడు. కాగా సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా ఆకట్టుకున్న బట్లర్‌.. ఆ తర్వాత కాస్త వెనుబడ్డాడు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1లో 89 పరుగులతో అజేయంగా నిలిచి తిరిగి ఫామ్‌ అందుకున్నాడు.

ఈ క్రమంలో క్వాలిఫైయర్‌-2లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన బట్లర్‌.. 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌ నిలిచి రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బట్లర్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపాడు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య, అభిమానుల మద్దతు నడుమ ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం తనకు తృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. 

ఇక ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్‌, రాజస్తాన్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన దివంగత షేన్‌ వార్న్‌ను గుర్తు చేసుకున్న బట్లర్‌.. అతడిని తాము మిస్‌ అవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘రాజస్తాన్‌ రాయల్స్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి షేన్‌ వార్న్‌. మొదటి సీజన్‌లోనే కప్‌ సాధించిపెట్టాడు. ఆయనను చాలా మిస్‌ అవుతున్నాం. మా విజయాన్ని ఆయన పై నుంచి చూస్తూనే ఉంటారు. ఈరోజు మా ఆట తీరు చూసి చాలా గర్వపడతారు’’ అని వ్యాఖ్యానించాడు.

చదవండి 👇
Jos Buttler: వారెవ్వా.. బట్లర్‌ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం!
Trolls On RCB Fan Girl: 'ఆర్‌సీబీ కప్‌ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'

>
Poll
Loading...
మరిన్ని వార్తలు