Kagiso Rabada: టి20 క్రికెట్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

14 May, 2022 07:58 IST|Sakshi
Courtesy: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కగిసో రబాడ టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ను ఔట్‌ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో 200వ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్‌ సాధించిన మూడో బౌలర్‌గా రబాడ నిలిచాడు. రబాడ 146 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.

రబాడ కంటే ముందు రషీద్‌ ఖాన్‌ 134 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. పాక్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ 139 మ్యాచ్‌లతో రెండో స్థానం, ఉమర్‌ గుల్‌ 147 మ్యాచ్‌లతో నాలుగో స్థానం, లసిత్‌ మలింగ 149 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ప్లే ఆఫ్‌ ఆశలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ గర్జించింది. ఓపెనర్‌గా బెయిర్‌ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్‌స్టోన్‌(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పంజాబ్‌ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్‌వెల్‌  35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్‌ కింగ్స్‌ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఆరు ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా ఉంది. మరోవైపు ఆర్‌సీబీ మాత్రం 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఆరు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

చదవండి: Tilak Varma: తెలుగుతేజంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ ప్రశంసల వర్షం


మరిన్ని వార్తలు