Kane Williamson: కేన్‌ విలియం నుంచి విలన్‌గా మారాలి.. లేదంటే: అక్తర్‌

8 May, 2022 13:00 IST|Sakshi
సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs RCB: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇకనైనా బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాలని పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కేన్‌ తన స్థానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఓపెనర్‌గా తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022 ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. 

కానీ చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమితో వరుస పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఈ క్రమంలో టాప్‌-4లో ఉన్న ఆర్సీబీతో హైదరాబాద్‌ ఆదివారం(మే 8) తలపడనుంది. ప్లే ఆఫ్‌ రేసులో ముందుండాలంటే కేన్‌ సేనకు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనసరి.

ఇదిలా ఉంటే... కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ రాణిస్తున్నప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతడు చేసినవి 199 పరుగులు(ఒక హాఫ్‌ సెంచరీ). స్ట్రైక్‌రేటు 96.13. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కేన్‌ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.


షోయబ్‌ అక్తర్‌(ఫైల్‌ ఫొటో)

ఈ మేరకు.. ‘‘కేన్‌ ఇక విలియమ్సన్‌ నుంచి విలన్‌గా మారాలి. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాలి. పరుగులు రాబట్టాలి. లేదంటే అతడి జట్టు కష్టాల్లో ‍కూరుకుపోతుంది. నిజానికి టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లకు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేన్‌ దానిని సద్వినియోగం చేసుకోవడం లేదనిపిస్తోంది’’ అని స్పోర్ట్స్‌కీడాతో అక్తర్‌ తన అభిప్రాయం పంచుకున్నాడు.

ఇక సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడన్న అక్తర్‌.. పేసర్లు నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తన నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటూ జట్టుకు ఉపయోగపడతారనrి ప్రశంసించాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, ఆర్సీబీ తలపడబోతున్నాయి. ఇందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి.

చదవండి👉🏾Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు?

Poll
Loading...
మరిన్ని వార్తలు