Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌

18 May, 2022 12:42 IST|Sakshi
Photo Courtesy: IPL

ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌.. మరో కీలక మ్యాచ్‌ మిగిలి ఉండగానే స్వదేశానికి బయల్దేరాడు. కేన్ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేన్‌ ఐపీఎల్ బయో బబుల్‌ని వీడి స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో కేన్‌ మే 22న పంజాబ్ కింగ్స్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. కేన్‌ గైర్హాజరీలో భువనేశ్వర్‌ కుమార్‌ లేదా నికోలస్‌ పూరన్‌ ఆరెంజ్‌ ఆర్మీని ముందుండి నడిపించనున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌కు విలియమ్సన్‌ అందుబాటులో ఉండడన్న విషయాన్ని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 


కాగా, విలియమ్సన్‌ దంపతులకు 2020 డిసెంబర్‌లో అమ్మాయి జన్మించింది. ఆ సమయంలో కూడా కేన్‌ ఇలానే వెస్టిండీస్‌ పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. ప్రస్తుత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 19.64 సగటున 93.51 స్ట్రైయిక్ రేటుతో 216 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమైన కేన్‌.. జట్టును ముందుండి నడిపించడంలో విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. ఇక, ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు మిగతా మ్యాచ్‌లపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్‌ జట్లు తమతమ చివరి మ్యాచ్‌ల్లో ఓడి, సన్‌రైజర్స్‌.. పంజాబ్ కింగ్స్‌పై భారీ తేడాతో గెలిస్తే ఆరెంజ్‌ ఆర్మీ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.
చదవండి: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు!


 

మరిన్ని వార్తలు