Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే!

29 Apr, 2022 08:28 IST|Sakshi
కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(PC: IPL/BCCI)

IPL 2022 KKR Vs DC: ఐపీఎల్‌-2022లో వరుసగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, పేసర్‌ ముస్తాఫిజుర్‌ ధాటికి నిలవలేక కేకేఆర్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌(3), వెంకటేశ్‌ అయ్యర్‌(6) వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42), నితీశ్‌ రాణా(57), రింకూ సింగ్‌(23) మినహా ఎవరూ సింగిల్‌ డిజిట్‌ దాటలేదు. ఫలితంగా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన కోల్‌కతాకు పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కేకేఆర్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ స్పందిస్తూ తమ జట్టు ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఓటమికి సాకులు వెదుక్కోకుండా.. తప్పులు గుర్తించి ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయాం. టాపార్డర్‌లో తరచూ మార్పులు చేయడం(గాయాల కారణంగా ఆటగాళ్లు దూరం కావడం) ప్రభావం చూపుతోంది. సరైన కాంబినేషన్‌ సెట్‌ చేయలేకపోతున్నాం.

ఏదేమైనా మేము మూస పద్ధతి వీడి దూకుడుగా ఆడాల్సి ఉంది. ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కచ్చితంగా వీటన్నింటిలోనూ రాణించాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. గతం గురించి మర్చిపోయి ముందుకు సాగుతాం. అతివిశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఆడతాం. అప్పుడు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే ఏం చేయలేము కానీ.. ప్రయత్న లోపం ఉండకూడదు కదా!’’ అని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌- 41: కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్లు
కేకేఆర్‌- 146/9 (20)
ఢిల్లీ- 150/6 (19)

చదవండి👉🏾 Hardik Pandya: ఇప్పుడు అదృష్టం కలిసి వస్తోంది.. కానీ నా భయానికి కారణం అదే!

మరిన్ని వార్తలు