MI VS KKR Head To Head Records: హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..?

6 Apr, 2022 18:57 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022లో భాగంగా నేడు (ఏప్రిల్‌ 6) మ‌రో ఆస‌క్తిర పోరుకు తెరలేవనుంది. పూణేలోని ఎంసీఏ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌, పటిష్టమైన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ముంబై (డీసీ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి, ఆర్‌ఆర్‌ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి) ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని తహతహలాడుతుండగా,  ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు (సీఎస్‌కేపై 6 వికెట్ల తేడాతో గెలుపు, పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు), మరో పరాజయం (ఆర్సీబీ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి) చవిచూసిన కేకేఆర్‌ మూడో విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. 

హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 29 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియ‌న్స్ రికార్డు స్థాయిలో 22 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించగా, కోల్‌క‌తా కేవ‌లం 7 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. కేకేఆర్‌పై ముంబై ఇండియ‌న్స్ అత్య‌ధిక స్కోర్‌ 210 ప‌రుగులు కాగా,  ముంబైపై కేకేఆర్‌ అత్యుత్తమంగా 232 ప‌రుగులు చేసింది. ఇరు జట్లు ముఖాముఖి తలపడిన సందర్భాల్లో ముంబై అత్య‌ల్ప స్కోర్‌ 108 ప‌రుగులు కాగా,  కేకేఆర్‌ అత్యల్ప స్కోర్‌ 67 ప‌రుగులుగా ఉంది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల పెర్ఫార్మెన్స్‌ను గమనిస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ముంబై కంటే కేకేఆర్‌ చాలా మెరుగ్గా కనిపిస్తుంది.

ముంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్),  సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తుది జ‌ట్టు (అంచనా): అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: పాక్ స్టార్‌ బ్యాటర్లు బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లకు ఘోర అవమానం.!

మరిన్ని వార్తలు