IPL 2022: కమిన్స్‌ కమాల్‌.. ముంబై ఢమాల్‌.. తిలక్‌ కొట్టిన సిక్సర్‌ మాత్రం హైలైట్‌!

7 Apr, 2022 07:53 IST|Sakshi
కేకేఆర్‌ ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌, ప్యాట్‌ కమిన్స్‌- ముంబై ప్లేయర్లు తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌(PC: IPL/BCCI))

బ్యాటింగ్‌లో చెలరేగిన పేస్‌ బౌలర్‌

ముంబైపై కోల్‌కతా విజయం

వెంకటేశ్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీ  

IPL 2022 KKR Vs MI- పుణే: ప్యాట్‌ కమిన్స్‌ 15 బంతుల్లో కోల్‌కతాను గెలిపించేశాడు... 41 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన కమిన్స్‌ తనొక్కడే 56 పరుగులతో చెలరేగాడు. వరుసగా 1, 6, 4, 0, 0, 6, 4, 1, 6, 4, 6, 6, 2, 4, 6 బాది తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించాడు. ఫలితంగా బుధవారం జరిగిన పోరులో నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ (36 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, తిలక్‌ వర్మ (27 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. వీరిద్దరు 49 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. అనంతరం కోల్‌కతా 16 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్యాట్‌ కమిన్స్‌ (15 బంతుల్లో 56 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 50 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  

కీలక భాగస్వామ్యం... 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ రెండు భిన్న  పార్శ్వాలుగా సాగింది. 15 ఓవర్ల వరకు ఆ జట్టు ఆట ఒక తీరుగా (85 పరుగులు) ఉంటే, చివరి 5 ఓవర్లలో (76 పరుగులు) మరో స్థాయిలో కనిపించింది. 15 ఓవర్ల వరకు ఒక్కసారి కూడా రన్‌రేట్‌ 6 పరుగులు దాటలేదంటే ముంబై ఎంత నెమ్మదిగా ఆడిందో, కోల్‌కతా ఎంత పదునైన బౌలింగ్‌ను ప్రదర్శించిందో అర్థమవుతుంది.

రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ విఫలమవ్వగా... ‘బేబీ డివిలియర్స్‌’గా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్, తిలక్‌ భాగస్వామ్యం ముంబై ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఉమేశ్‌ ఓవర్లో సూర్య వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టగా... కమిన్స్‌ బౌలింగ్‌లో స్కూప్‌ షాట్‌తో తిలక్‌ కొట్టిన సిక్సర్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది!

అదే ఓవర్లో మరో ఫోర్‌ కొట్టిన తిలక్‌...వరుణ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 బాదాడు. నరైన్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టి 34 బంతుల్లోనే సూర్యకుమార్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కమిన్స్‌ వేసిన ఆఖరి ఓవర్లో చెలరేగిన పొలార్డ్‌ (5 బంతుల్లో 22 నాటౌట్‌; 3 సిక్స్‌లు) వరుసగా 2, 6, 2, 6, 6 కొట్టడంతో మెరుగైన స్కోరు నమోదైంది.  

వెంకటేశ్‌ అర్ధసెంచరీ... 
ఒక ఎండ్‌లో ఓపెనర్‌ వెంకటేశ్‌ పట్టుదలగా నిలబడగా, మరో ఎండ్‌లో కోల్‌కతా వికెట్ల పతనం సాగింది. రహానే (7) విఫలం కాగా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (10) బాధ్యతగా ఆడలేకపోయాడు. బిల్లింగ్స్‌ (17), రాణా (8)లతో పాటు ఆశలు పెట్టుకున్న రసెల్‌ (11) కూడా ప్రభావం చూపలేదు.

వెంకటేశ్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ నడిపిస్తూ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతటితో అతని బాధ్యత ముగిసింది. కమిన్స్‌ విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం అందే వరకు వెంకటేశ్‌ది ప్రేక్షక పాత్రే అయింది. 

చదవండి: Pat Cummins: ఎంట్రీతోనే అదరగొట్టిన కమిన్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో కొత్త రికార్డు

మరిన్ని వార్తలు