IPL 2022 KKR Vs PBKS: నేనేం చేయగలనో నాకు తెలుసు.. క్రికెట్‌ ఆడేది అందుకే: రసెల్‌

2 Apr, 2022 09:48 IST|Sakshi
సామ్‌ బిల్లింగ్స్‌- ఆండ్రీ రసెల్‌(PC: IPL/BCCI)

IPL 2022: 31 బంతుల్లో 70 పరుగులు.. రెండు ఫోర్లు.. ఎనిమిది సిక్సర్లు.. స్ట్రైక్‌ రేటు 225.81. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌తో.. భారీ షాట్లతో ఐపీఎల్‌ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ హిట్టర్‌ ఆండ్రీ రసెల్‌. విధ్వంసకర ఆట తీరుతో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెబ్బై పరుగులతో అజేయంగా నిలిచి కేకేఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన ప్రదర్శనతో పొట్టి ఫార్మాట్‌ ప్రేమికులకు రసెల్‌ అసలైన మజాను అందించాడు. కేకేఆర్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నాంటూ సామ్‌ బిల్లింగ్స్‌ సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన రసెల్‌.. తానేం చేయగలనో తనకు తెలుసనని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ ఫీలింగ్‌ అద్బుతంగా ఉంది. ఇలాంటి అనుభూతుల కోసమే కదా క్రికెట్‌ ఆడేది!

జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్నపుడు నేనేం చేయాలో.. నేనేం చేయగలనో నాకు తెలుసు. సామ్‌ బిల్లింగ్స్‌ వంటి ఆటగాడు సహకారం అందిస్తూ.. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం కలిసి వచ్చింది. నా శక్తిసామర్థ్యాలేమిటో నాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును బయటపడేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నోఆ. జట్టు ప్రయోజనాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ రెడీగా ఉంటా’’ అని రసెల్‌ పేర్కొన్నాడు.

కాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించడంతో పాటు రసెల్‌ బంతితోనూ మెరిసిన విషయం తెలిసిందే. కగిసో రబడ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ విజృంభణ, రసెల్‌ మెరుపు బ్యాటింగ్‌తో కేకేఆర్‌ పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

చదవండి: IPL 2022: రసెల్‌ విధ్వంసం

మరిన్ని వార్తలు