IPL 2022: క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ సహా ఫైనల్‌ మ్యాచ్ వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ..!

13 Apr, 2022 12:23 IST|Sakshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత జరిగే క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ సహా ఫైనల్‌ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు (ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం, వాంఖడే, బ్రబోర్న్‌ స్టేడియం, పూణేలోని ఎంసీఏ స్టేడియం) మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.

దేశంలో కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికలను విస్తరించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో నిర్వహించాలని డిసైడ్‌ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ రెండో క్వాలిఫయర్ సహా ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వేదికను కూడా దాదాపుగా కన్ఫర్మ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కీలక మ్యాచ్‌లను ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, తొలుత తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లను లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన విషయం  తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే నెల (మే) 22 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్, ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 29న ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 
చదవండి: IPL 2022: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా

మరిన్ని వార్తలు