IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ నిర్వహణ..!

30 Jan, 2022 20:41 IST|Sakshi

IPL 2022 Venues: కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌ల నిర్వహణను కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగా వేదికలను సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగి భారత్‌లో కోవిడ్‌ కేసులు అదుపులోకి వస్తే ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 3 మధ్య తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది.  

లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో, ప్లే ఆఫ్స్‌ను గుజరాత్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సైతం ఇదివరకే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. లీగ్‌ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్‌, పూణే స్టేడియాలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది. ఈ విషయమై ఐపీఎల్ పాలక మండలితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 

కాగా, దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేవలం రెండు రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించడం శ్రేయస్కరమని బోర్డు పెద్దలు నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే, స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా.. వద్దా.. అనే విషయం కూడా కొలిక్కి వచ్చినట్లు సదరు అధికారి వెల్లడించారు. లీగ్‌ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనీసం 25 శాతం సామర్థ్యంతో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా గత రెండు ఐపీఎల్‌ సీజన్లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే జరిగిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌లో ధోని పెట్టుబడులు.. ఈ ఏడాది నుంచే షురూ..!

మరిన్ని వార్తలు