IPL 2022: ధర 90 లక్షలు.. మొన్నటి దాకా బెంచ్‌కే పరిమితం.. కీలక వికెట్‌ తీసి.. ఆపై

8 Apr, 2022 12:06 IST|Sakshi
లక్నో సూపర్‌జెయింట్స్‌(PC: IPL/BCCI)

IPL 2022 LSG Vs DC: కృష్ణప్ప గౌతమ్‌.. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనూహ్యంగా రికార్డు ధర 9.25 కోట్లకు అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడికి నామమాత్రపు ధర దక్కింది. 

కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంఛైజీలు ఈ కర్ణాటక బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌పై ఆసక్తి చూపగా... కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ 90 లక్షలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. కానీ.. లక్నో జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో గౌతమ్‌కు ఆడే అవకాశం రాలేదు. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ టీమిండియా ఆటగాడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు మనీశ్‌ పాండే స్థానంలో గౌతమ్‌ జట్టులోకి వచ్చాడు. లక్నోకు కొరకరాని కొయ్యగా మారి బౌండరీలతో విరుచుకుపడ్డ ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా(34 బంతుల్లో 61 పరుగులు- 9 ఫోర్లు, రెండు సిక్సర్లు)ను పెవిలియన్‌కు పంపి బ్రేక్‌ ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న గౌతమ్‌ 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్‌ కూల్చి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గౌతమ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం లక్నో ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ మాట్లాడుతూ.. గౌతమ్‌ జట్టులోకి రావడం తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించాడు. అతడు బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించగలడని కొనియాడాడు.

ఆ 4 ఓవర్లు కీలకం..
స్పోర్ట్స్‌ కీడా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తనలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం దాగుంది. ఈ మ్యాచ్‌లో తను వేసిన నాలుగు ఓవర్లు మాకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి. ముఖ్యంగా కీలకమైన వికెట్‌ తీసి, భారీ భాగస్వామ్యాన్ని అతడు బ్రేక్‌ చేయడం కలిసి వచ్చింది. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.

ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎలా ముగించామన్నదే పరిగణనలోకి వస్తుంది. ఎవరి బౌలింగ్‌ను ఎవరు ఎప్పుడు చీల్చిచెండాడుతారో తెలియదు. కాబట్టి సంయమనంగా ఉంటూ ఛాన్స్‌ వచ్చినపుడు వికెట్‌ పడగొట్టడమే తెలివైన పని. నిజానికి నేను మొదటి ఓవర్‌ వేసిన తర్వాత బంతి ఎక్కువగా స్వింగ్‌ కావడం లేదని మా వాళ్లకు చెప్పాను.

పవర్‌ ప్లేలో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావించాము. మాకు మంచి స్పిన్నర్లు ఉన్నారు. రవి బిష్ణోయి అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. గౌతమ్‌ మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. మా ప్రణాళికలను మైదానంలో చక్కగా అమలు చేశాం. ఇది సమిష్టి విజయం’’ అని చెప్పుకొచ్చాడు.

లక్నో సూపర్‌జెయింట్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
ఢిల్లీ- 149/3 (20)
లక్నో- 155/4 (19.4)
ఆరు వికెట్ల తేడాతో లక్నో విజయం

చదవండి: IPL 2022: పంత్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో?

మరిన్ని వార్తలు