IPL 2022 LSG Vs DC: డికాక్‌ మెరుపు బ్యాటింగ్‌.. లక్నో హ్యాట్రిక్‌! పాపం పృథ్వీ షా!

8 Apr, 2022 07:39 IST|Sakshi
PC: IPL/BCCI

6 వికెట్లతో ఢిల్లీపై గెలుపు 

డి కాక్‌ మెరుపు బ్యాటింగ్‌ 

పృథ్వీ షా అర్ధసెంచరీ వృథా 

IPL 2022 LSG Vs DC- ముంబై: ఐపీఎల్‌ కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. తొలి పోరులో మరో కొత్త టీమ్‌ గుజరాత్‌ చేతిలో ఓడాక... వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్‌ డికాక్‌ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు.  

పృథ్వీ అర్ధ శతకం 
పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు 52/0. డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ క్రీజులో ఉండగా... పృథ్వీ షా కొట్టిన పరుగులే 47! ఆస్ట్రేలియన్‌ మూడే పరుగులు చేశాడు. మరో రెండు ఓవర్లకు వార్నర్‌ ఇంకో పరుగు చేస్తే ఢిల్లీ బ్యాటర్‌ ఫిఫ్టీ పూర్తయ్యింది. 67 జట్టు స్కోరులో పృథ్వీ షా 61 పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఈ స్కోర్ల తీరును పరిశీలిస్తే అతను ఏ రేంజ్‌లో దంచేశాడో అర్థం చేసుకోవచ్చు. గౌతమ్‌ వేసిన రెండో ఓవర్‌ నుంచి పృథ్వీ తన బ్యాట్‌కు షాట్లను, స్కోరుకు వేగాన్ని జతచేశాడు. మూడో ఓవర్‌ హోల్డర్‌ వేస్తే చూడచక్కని రీతిలో 4, 6 బాదేశాడు.

అవేశ్‌ ఖాన్‌ నాలుగో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు, రవి బిష్ణోయ్, అండ్రూ టై ఇలా 6 ఓవర్ల పవర్‌ ప్లేలోనే ఏకంగా 5 మంది బౌలర్లను మార్చినా... అతని ధాటిని ఏమార్చలేకపోయారు. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో షా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  

‘షో’కు స్పిన్‌ తూట్లు 
అప్పటిదాకా ఫోర్లు, సిక్సర్లతో మార్మోగిన స్టేడియం తర్వాత కాసేపటికే మూగబోయినంత పనైంది. పృథ్వీ షా అవుటయ్యాక ఢిల్లీ ఆట గతి తప్పింది.  పృథ్వీని కృష్ణప్ప గౌతమ్‌ పెవిలియన్‌ చేర్చగా, వార్నర్‌ (4)ను రవి బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో రోమన్‌ పావెల్‌ (3)ను కూడా బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయడంతో 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.

తర్వాత పంత్‌ (36 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ (28 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆఖరి దాకా క్రీజులో ఉన్నా కూడా లక్నో బౌలింగ్‌పై ఎదురు దాడి చేయడంలో విఫలమయ్యారు. వీరిద్దరు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో 5.4 ఓవర్లో 50 పరుగులు చేసిన జట్టే తర్వాత మిగిలిన 14.2 ఓవర్లలో 100 పరుగులైనా చేయలేకపోయింది. 

డికాక్‌ జోరు 
పెద్ద లక్ష్యం కాకపోవడంతో లక్నో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (25 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌), డికాక్‌ నింపాదిగా ఆట ప్రారంభించారు. ఐదో ఓవర్‌లో డికాక్‌ ఆట మారింది. నోర్జే వేసిన ఆ ఓవర్‌ను పూర్తిగా డికాకే ఆడి 4, 4, 4, 0, 6, 1తో 19 పరుగులు పిండుకున్నాడు. 6.4 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. కుల్దీప్‌ తొలి ఓవర్లో లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ కొట్టిన రాహుల్‌ మళ్లీ అతని మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 10వ)  మరో షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో పృథ్వీషా చేతికి చిక్కాడు.

మరోవైపు డికాక్‌ 36 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఎవిన్‌ లూయిస్‌ (5) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. డికాక్‌ మాత్రం తన దాటిని కొనసాగిస్తూ అడపాదడపా బౌండరీలతో లక్ష్యానికి చేరేందుకు అవసరమైన పరుగులు క్రమం తప్పకుండా సాధించిపెట్టాడు.

కుల్దీప్‌ 16వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు కొట్టిన డికాక్‌ ఆఖరి బంతికి అవుటయ్యాడు. తర్వాత దీపక్‌ హుడా (11), కృనాల్‌ పాండ్యా (14 బంతుల్లో 19 నాటౌట్‌; 1 సిక్స్‌) ఒకటి, రెండు పరుగులతో మ్యాచ్‌ను ఆఖరిదాకా సాగదీశారు. ఆఖరి ఓవర్లో హుడా అవుటవగా... బదోని (10 నాటౌట్‌) 4, 6తో మరో రెండు బంతులుండానే జట్టును గెలిపించాడు.   

చదవండి: IPL 2022: నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు 

మరిన్ని వార్తలు