IPL 2022 LSG Vs GT: టాప్‌ టు జట్ల మధ్య పోరు.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..?

10 May, 2022 14:41 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్‌ టు జట్ల మధ్య ఇవాళ (మే 10) ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ నేటి మ్యాచ్‌లో అమితుమీ తేల్చుకోనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు టేబుల్‌ టాపర్స్‌ మధ్య రసవత్తర సమరం షురూ కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరి 8 విజయాలు సాధించాయి. అయితే రన్‌రేట్‌ ఆధారంగా లక్నో (0.703) టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. 

ఇరు జట్ల ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే లక్నో కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. గుజరాత్‌ గత రెండు మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు (పంజాబ్‌, ముంబై) చవిచూసి కాస్త నిరాశగా కనిపిస్తుండగా.. లక్నో హ్యాట్రిక్‌ విజయాలు (పంజాబ్‌, ఢిల్లీ, కేకేఆర్‌) సాధించి హుషారుగా కనిపిస్తుంది. ఇక బలాబలాల విషయానికొస్తే.. గుజరాత్‌, లక్నో జట్లు అన్ని విభాగాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. గుజారత్‌ టీమ్‌లో ఓపెనర్లు గిల్‌, సాహా సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. టాపార్డర్‌లో సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా,రషీద్ ఖాన్ అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్‌, ప్రదీప్ సంగ్వాన్‌లు సైతం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నారు. 

ఇక లక్నో విషయానికొస్తే.. ఈ జట్టులోనూ ఓపెనర్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. చివరి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ డకౌట్ అయినప్పటికీ.. డికాక్ చెలరేగిపోయాడు. టాపార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్‌లు అవకాశం దొరికినప్పుడల్లా సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆవేశ్‌ ఖాన్‌, మొహిసిన్‌ ఖాన్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా రాణిస్తున్నారు. 

తుది జట్లు (అంచనా)..

లక్నో సూపర్ జెయింట్స్‌: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, మొహిసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ . 

కోల్‌కత నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, ప్రదీప్ సంగ్వాన్.
చదవండి: IPL 2022: నా లక్కీ చార్మ్‌ ఈసారి నావైపే.. కాబట్టి: కృనాల్‌ పాండ్యా

మరిన్ని వార్తలు