LSG VS RCB: భారీ రికార్డులపై కన్నేసిన డీకే

19 Apr, 2022 17:43 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరుగనున్న ఆసక్తికర సమరంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ పలు భారీ రికార్డులపై కన్నేశాడు. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ మరో 45 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్కును చేరుకుంటాడు. అలాగే నేటి మ్యాచ్‌లో కార్తీక్‌ మరో 3 బౌండరీలు సాధిస్తే, ఐపీఎల్‌లో 400 ఫోర్లు బాదిన క్రికెటర్ల క్లబ్‌లో చేరతాడు. 

ప్రస్తుత సీజన్‌లో డీకే ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ రెండు రికార్డులు సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. ఇక ఇదే మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. దీపక్‌ హుడా మరో 45 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకోనుండగా, మార్కస్‌ స్టోయినిస్‌ మరో 38 పరుగలు చేస్తే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 1000 పరుగులు సాధించిన క్రికెటర్ల క్లబ్‌లో చేరతాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు చెరో 6 మ్యాచ్‌లు ఆడిన లక్నో, ఆర్సీబీ జట్లు సమంగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పరంగా (8) ఇరు జట్లు సమంగానే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్సీబీ కంటే లక్నోనే ముందుంది. కాగా, ఇరు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై గెలుపొంది ఉత్సాహంగా ఉన్నాయి. లక్నో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించగా, ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
చదవండి: అమితుమీ తేల్చుకోనున్న లక్నో, ఆర్సీబీ.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే...?

మరిన్ని వార్తలు