IPL 2022 LSG Vs RCB: అమితుమీ తేల్చుకోనున్న లక్నో, ఆర్సీబీ.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే...?

19 Apr, 2022 12:43 IST|Sakshi
Photo Courtesy: IPL

LSG VS RCB Match Prediction: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 19) మరో రసవత్తర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు చెరి 6 మ్యాచ్‌లు ఆడిన లక్నో, ఆర్సీబీ జట్లు సమంగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు పాయింట్ల పరంగా (8) సమంగానే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ కారణంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ (4వ స్థానం) కంటే లక్నోనే (3) ముందుంది. జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులపై గెలుపొంది ఉత్సాహంగా ఉన్నాయి. లక్నో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించగా, ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 

కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఇప్పటివరకు ఆడిన  మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ విభాగంలో పటిష్టంగా కనిపించినప్పటికీ.. బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ పర్వాలేదనిపిస్తుండగా, దుష్మంత చమీరా, జేసన్‌ హోల్డర్‌, కృనాల్‌ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముంబైతో మ్యాచ్‌లో చమీరా 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకోవడంతో ఈ మ్యాచ్‌లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. లక్నో ఈ ఒక్క మార్పు మినహాయించి ముంబైతో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఇక బ్యాటింగ్‌లో జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ముంబైపై అద్భుత శతకం సాధించి సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతుండగా,  డికాక్‌, దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోని గత మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. ముంబైతో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన మనీశ్‌ పాండే 29 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 38 పరగులు చేసి నేటి మ్యాచ్‌లో ప్లేస్‌ను పక్కా చేసుకున్నాడు. ఆల్‌రౌండర్లు స్టోయినిస్‌, కృనాల్‌ పాండ్యాలు తమ స్థాయి తగ్గట్టుగా రాణించాల్సి ఉంది.

ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. కొత్త కెప్టెన్‌ డుప్లెసిస్‌ సారథ్యంలో యువకులు, సీనియర్ల కలయికతో జట్టు ఉరకలేస్తుంది. బ్యాటింగ్‌లో అనుజ్‌ రావత్‌, ప్రభుదేస్సాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌ లాంటి యువకులు రాణిస్తుండగా, సీనియర్లు డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ఎటొచ్చి మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ ఆర్సీబీని కలవరపెడుతుంది. బౌలింగ్‌లో సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, హేజిల్‌వుడ్‌ పర్వాలేదనిపిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌, కార్తీక్‌ అర్ధసెంచరీలతో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడగా.. బౌలింగ్‌లో సిరాజ్‌ (2/28),హేజిల్‌వుడ్‌ (3/28) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశారు. ఢిల్లీపై బరిలోకి దిగిన జట్టునే ఆర్సీబీ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. 

తుది జట్టు (అంచనా):
లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌, డికాక్‌, మనీశ్‌ పాండే, స్టోయినిస్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, ఆయుష్‌ బదోని, జేసన్‌ హోల్డర్‌, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌ 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, ప్రభుదేస్సాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌, సిరాజ్‌
చదవండి:ఆమె కంటే మేమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం చహల్‌!

మరిన్ని వార్తలు