రాజస్థాన్ ప్లేయర్లు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో అల్లకల్లోలం.. విమానం దించాలంటూ కేకలు..!

23 May, 2022 09:47 IST|Sakshi
Photo Courtesy: IPL

తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22) ముంబై నుంచి ఆర్‌ఆర్‌ బృందంతో బయల్దేరిన ప్రత్యేక విమానంలో కొంత సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పుల కారణంగా విమానంలోకి ఒక్కసారిగా దట్టమైన పొగమంచు వచ్చి చేరింది. దీంతో రాజస్థాన్ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఆర్‌ఆర్‌ బృందంలోని ఓ వ్యక్తి.. విమానం దించాలంటూ గట్టిగా కేకలు వేశాడు. 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)


అయితే కొద్ది సేపటికే పొగమంచు మొత్తం క్లియర్‌ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో 'హల్లా బోల్' అనే నినాదాలతో విమానం మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ తమ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియోలో యశస్వి జైస్వాల్‌ తదితర సభ్యులు కనిపించారు. కాగా, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఆర్‌ఆర్‌ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో ఫ్లై‌ట్‌లోకి పొగమంచు చేరింది. 

ఇదిలా ఉంటే, సీఎస్‌కేపై విజయంతో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్‌ దశను ముగించిన విషయం తెలిసిందే. శాంసన్‌ సేన మే 24న ఈడెన్ గార్డెన్స్‌లో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. 
చదవండి: లివింగ్‌స్టోన్‌ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్‌ చేతిలో చిత్తైన సన్‌రైజర్స్‌


 

మరిన్ని వార్తలు