Glenn Maxwell: గోల్డెన్‌ డక్‌ తప్పించుకొని మ్యాచ్‌ విన్నర్‌గా.. రూల్స్‌ మార్చాల్సిందే!

20 May, 2022 08:30 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గురువారం ఆర్‌సీబీ గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. కోహ్లి దంచుడు.. మ్యాక్స్‌వెల్‌ మెరుపులతో 18.4 ఓవరల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే మ్యాక్స్‌వెల్‌ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే కోహ్లి, డుప్లెసిస్‌ మధ్య 115 పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. 38 బంతుల్లో 44 పరుగులు చేసిన డుప్లెసిస్‌ను రషీద్‌ ఆ ఓవర్‌ రెండో బంతికి పెవిలియన్‌ చేర్చాడు.

ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే రషీద్‌ మ్యాక్సీకి గూగ్లీ వేశాడు. స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ బంతిని మిస్‌ చేయగా.. నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్‌ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్‌ ప్రకారం బెయిల్స్‌ కింద పడితేనే బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అయినట్లు. వరుసగా రెండో వికెట్‌ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్‌ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు. అలా గోల్డెన్‌ డక్‌ నుంచి తప్పించుకున్న మ్యాక్స్‌వెల్‌ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా ఈ సీజన్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రాజస్తాన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో చహల్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ కూడా ఇలాగే తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడకపోవడంతో వార్నర్‌ బతికిపోయాడు. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ''రూల్‌ మార్చండి.. బంతి వికెట్లను తాకి బెయిల్స్‌ కిందపడినా.. పడకపోయినా ఔట్‌ ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు ఇవే మ్యాచ్‌ను మలుపుతిప్పుతాయి. మ్యాక్స్‌వెల్‌ విషయంలో ఇదే జరిగింది. గోల్డెన్‌ డక్‌ నుంచి తప్పించుకొని మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు.'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్‌.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్‌

Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా

>
Poll
Loading...
మరిన్ని వార్తలు