IPL 2022: ‘మా మరో ఆణిముత్యం’.. ఆ డబ్బుతో ఇల్లు కొంటానన్న తిలక్‌ వర్మ.. ఇకపై..

3 Apr, 2022 14:22 IST|Sakshi
తిలక్‌ వర్మ(PC: IPL/BCCi)

జస్‌ప్రీత్‌ బుమ్రా నుంచి హార్దిక్‌ పాండ్యా వరకు ఎంతో మంది ‘యువ ఆటగాళ్ల’కు ప్రోత్సహించింది ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ. ఐపీఎల్‌ వేలం రూపంలో వారిపై కనకవర్షం కురిపించి.. ఆటగాళ్ల ప్రతిభను ఉపయోగించుకోవడంతో పాటు వారు అవకాశాలు పొందడంలోనూ పరోక్షంగా దన్నుగా నిలిచింది. బుమ్రా, పాండ్యాతో పాటు ముంబై జట్టులో చోటు దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో దిట్ట అంటూ ముంబై ఫ్యాన్స్‌ తమ జట్టు గురించి కామెంట్లు చేస్తూ ఉంటారు.  ఇక ఇప్పుడు తిలక్‌ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగరాజు కుమారుడు తిలక్‌ వర్మ. తండ్రి నాగరాజు, కోచ్‌ సాలమ్‌ బయాష్‌ ప్రోత్సాహంతో అతడు క్రికెటర్‌గా ఎదిగాడు.

అండర్‌-19 భారత జట్టులో సభ్యుడైన తిలక్‌.. ఇటీవలి విజయ్‌ హజారే ట్రోఫీ(180 పరుగులు), టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(215 పరుగులు)తో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు.  ఈ క్రమంలో మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తిలక్‌ వర్మను కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేసింది.

ఇక లక్కీగా తుదిజట్టులోనూ చోటు దక్కించుకుంటున్న తిలక్‌ వర్మ శనివారం నాటి రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 61 పరుగులు చేసిన అతడు ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకు ముందు ఇషాన్‌ కిషన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ క్రమంలో తిలక్‌ వర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక ఐపీఎల్‌లో ఆడటం నేపథ్యంలో తిలక్‌ వర్మ మాట్లాడుతూ... ‘‘మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా నాన్న చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆ జీతంతోనే నా క్రికెట్‌ కోచింగ్‌కు అయ్యే ఖర్చులు... మా అన్న చదువులు వెళ్లదీయాలి. అయితే, గత కొన్నేళ్లుగా కొంతమంది స్పాన్సర్లు ముందుకు రావడం, మ్యాచ్‌ ఫీజుల రూపంలో డుబ్బు అందడంతో నా ఖర్చులు నేనే చూసుకుంటున్నాను. 

నిజానికి మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్‌ ఆడటం ద్వారా నాకు వచ్చిన మొత్తాన్ని ఇంటి కోసమే ఖర్చు చేస్తాను. మా అమ్మానాన్నల కోసం ఇల్లు నిర్మించడమే నా ఏకైక లక్ష్యం. ఐపీఎల్‌ నాకు మెరుగైన జీవితంతో పాటు స్వేచ్ఛగా ఆడే వెసలుబాటును కూడా కల్పించింది’’ అని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌తో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి గతంలో చెప్పుకొచ్చాడు. ఇక అతడిని కొనుగోలు చేయడం, తుదిజట్టులో చోటు కల్పించడం.. తనను తాను నిరూపించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ముంబై ఫ్యాన్స్‌ తమ ఫ్రాంఛైజీ దొరికిన మరో ఆణిముత్యాన్ని వెలికి తీసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో తిలక్‌ వర్మ రాణించినప్పటికీ అతడి జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో అతడు మాట్లాడుతూ.. ఓటమి బాధించిందని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి జట్టు విజయాల్లో భాగమవుతానని వెల్లడించాడు.


 

మరిన్ని వార్తలు