IPL 2022 MI Vs CSK: చెన్నైతో తలపడనున్న ముంబై.. బోణీనా.. రెండో విజయమా..?

21 Apr, 2022 14:44 IST|Sakshi
Photo Courtesy: IPL

CSK VS MI Head To Head Records: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన రెండు జట్ల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 21) ఆసక్తికర పోటీ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో చెన్నై ఈ మ్యాచ్‌లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో (6) చెన్నై ఒకే ఒక్క విజయం నమోదు చేయగా, ముంబై.. బోణీ కూడా చేయలేని దుస్థితిలో ఉంది. 

ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన మినహాయిస్తే లీగ్‌ చరిత్రలో ఇరు జట్లకు ఘనమైన రికార్డే ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగ్గా చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. ఈ గణాంకాల వరకు చూస్తే చెన్నైదే పూర్తి ఆధిపత్యంలా కనిపిస్తున్నా, గత 14 మ్యాచ్‌ల్లో రికార్డులు ముంబైదే పైచేయిగా చూపిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన గత 14 మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, చెన్నై కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. 

ఇక ప్రస్తుత సీజన్‌ విషయానికొస్తే.. ఇప్పటికే ఓటముల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన ముంబై ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సీఎస్‌కే పరిస్థితి సైతం ఇంచుమించు ఇలాగే ఉంది. చెన్నై ఆర్సీబీపై గెలిచి బోణీ కొట్టడంతో నేటి మ్యాచ్‌లో ఓడి, ఆతరువాత మిగిలిన 7 మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.

ఈ మ్యాచ్‌లో తుది జట్ల విషయానికొస్తే.. ముంబై రెండు మార్పులతో, చెన్నై ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముంబై.. పొలార్డ్‌కు విశ్రాంతినిచ్చి టిమ్‌ డేవిడ్‌ను, టైమాల్‌ మిల్స్‌పై వేటు వేసి మెరిడిత్‌ను తుది జట్టుకు ఎంపిక చేసే అవకాశాలుండగా, చెన్నై.. క్రిస్ జోర్డాన్ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ అవకాశం కల్పించవచ్చు. ముంబై తమ చివరి మ్యాచ్‌లో లక్నో చేతిలో 18 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వగా, చెన్నై 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడింది. 

తుది జట్లు(అంచనా):
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ఫేబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్‌ బుమ్రా, రిలే మెరిడిత్, జయదేవ్ ఉనద్కత్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి
చదవండి: ఫ్రీగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్‌ లింకును దొంగిలించి..!

మరిన్ని వార్తలు