IPL MI Vs DC Head To Head Records: ముంబైతో ఢిల్లీ ఢీ.. తుది జట్లలో ఎవరెవరు ఉండబోతున్నారంటే..?

21 May, 2022 14:24 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. ప్లే ఆఫ్స్‌ నాలుగో స్థానాన్ని ఖరారు చేసే ఈ బిగ్‌ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ముంబై 13 మ్యాచ్‌ల్లో 10 పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించగా.. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు (14 పాయింట్లు, 0.225 రన్‌రేట్‌) సాధించిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలపొంది ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సైతం ఇదే మ్యాచ్‌పై ఆధారపడి ఉండటంతో మూడు జట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
 
ఢిల్లీదే పైచేయి..
ప్రస్తుత సీజన్‌లో ముంబై, ఢిల్లీ జట్లు రెండోసారి తలపడుతున్నాయి. సీజన్‌ తొలి అర్ధ భాగంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైని మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇషాన్‌ కిషన్‌ (81) విజృంభించడంతో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. ఛేదనలో లలిత్‌ యాదవ్‌ (48), అక్షర్‌ పటేల్‌ (38) రాణించి ఢిల్లీకి 19వ ఓవర్లోనే విజయాన్నందించారు. ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఢిల్లీ-ముంబై జట్లు 31 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. 16 మ్యాచ్‌ల్లో ముంబై, 15 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందాయి. 

తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
నేటి మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ పలు ప్రయోగాలు చేసే అస్కారం ఉంది. సన్‌రైజర్స్‌ చేతిలో గత మ్యాచ్‌లో ఓడిన జట్టులో నుంచి రిలే మెరిడిత్‌ను తప్పించే అవకాశం ఉంది. మెరిడిత్‌ స్థానంలో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఒకవేళ సంజయ్‌ యాదవ్‌ను కూడా తప్పించాలని భావిస్తే అతని స్థానంలో ఆకాశ్‌ మధ్వాల్‌కు అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. ఈ రెండు మార్పులు మినహా పెద్దగా ప్రయోగాలు చేయడానికి ముంబై సాహసించకపోవచ్చు.

మరోవైపు ఢిల్లీ నేటి మ్యాచ్‌లో మార్పుల్లేకుండానే బరిలోకి దిగవచ్చు. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను మట్టికరిపించిన జట్టునే పంత్‌ యధాతథంగా కొనసాగించే ఛాన్స్‌ ఉంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీకి డూ ఆర్‌ డై మ్యాచ్‌ కావడంతో పెద్దగా ప్రయోగాలు చేసే సాహసం చేయకపోవచ్చు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు కాబట్టి పృథ్వీ షాకు కూడా అవకాశం రాకపోవచ్చు. పంత్‌ మినహా జట్టు మొత్తం రాణిస్తుండటంతో ఎలాంటి మార్పులకు ఆస్కారం ఉండదనే చెప్పాలి.

తుది జట్లు(అంచనా)..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టీమ్‌ డేవిడ్, డానియల్ సామ్స్, సంజయ్ యాదవ్/ఆకాశ్‌ మధ్వాల్‌, అర్జున్‌ టెండూల్కర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మురుగన్ అశ్విన్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్
చదవండి: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి!

మరిన్ని వార్తలు