IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే..

17 May, 2022 13:07 IST|Sakshi
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 MI Vs SRH: వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు. ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ గెలిచి పడిలేచిన కెరటంలా దూసుకువచ్చిన విలియమ్సన్‌ బృందం.. ఆ తర్వాత చతికిలపడింది. వరుస మ్యాచ్‌లలో ఓడి మరోసారి విమర్శల పాలైంది.

ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ చేతిలో 67 పరుగులు, కేకేఆర్‌ చేతిలో 54 పరుగుల  తేడాతో ఓడి ప్లే ఆఫ్స్‌ రేసులో మరింత వెనుకబడింది. దీంతో ఆఖరి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధిస్తే తప్ప ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండవు. ఇలాంటి తరుణంలో మంగళవారం(మే 17న) ముంబై ఇండియన్స్‌తో పోరుకు ఎస్‌ఆర్‌హెచ్‌ సిద్ధమైంది.


లీసా స్తాలేకర్‌(ఫైల్‌ ఫొటో)

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ లీసా స్తాలేకర్‌ ఈ ఎడిషన్‌లో విలియమ్సన్‌ సేన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. సన్‌రైజర్స్‌ ప్రయాణం ముగిసినట్లే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఇందుకు గల కారణాలను విశ్లేషించారు. ‘‘గత చివరి రెండు మ్యాచ్‌లలో వాళ్లు(సన్‌రైజర్స్‌‌) 120+ స్కోరు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసినా.. లక్ష్య ఛేదనకు దిగినా ఇలాంటి స్కోర్లు ఎంతమాత్రం సరిపోవు. 

ముఖ్యంగా టాపార్డర్‌లో కేన్‌ విలియమ్సన్‌ బాగా ఆడితేనే ఫలితం ఉంటుంది. ఓ వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ నుంచి కనీస ప్రదర్శన ఆశించడంలో తప్పులేదు. తను అస్సలు స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. అందుకే వాళ్లు చివరి రెండు మ్యాచ్‌లు గెలుస్తారని అనుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అని లీసా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇక గాయాలబారిన పడిన వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌ సేవలను సన్‌రైజర్స్‌ కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. కేన్‌ విలియమ్సన్‌ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌లలో విలియమ్సన్‌ సాధించిన పరుగులు 208. అత్యధిక స్కోరు 57. 

చదవండి👉🏾IPL 2022: 'మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు'

మరిన్ని వార్తలు