IPL 2022: అశ్విన్‌ అరుదైన ఘనత.. జడేజా తర్వాత..!

11 May, 2022 22:16 IST|Sakshi
Photo Courtesy: IPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ బాదిన యాష్‌.. లీగ్‌ చరిత్రలో తొలి అర్ధసెంచరీ సాధించేందుకు అత్యధిక ఇన్నింగ్స్‌ల సమయం తీసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

అశ్విన్‌.. తన 72వ ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో తొలిసారి 50 పరుగుల మార్కును అందుకోగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా తొలి అర్ధశతకం సాధించేందుకు ఏకంగా 132 ఇన్నింగ్స్‌ల సమయం తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాత హర్భజన్‌ (61 ఇన్నింగ్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (31) తొలి అర్ధ సెంచరీ సాధించేందుకు అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

కాగా, డీసీతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌.. తన సహజ శైలికి భిన్నంగా వినూత్నమైన షాట్లు ఆడి 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అశ్విన్‌ ప్రస్తుత ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కీరన్‌ పోలార్డ్‌ కంటే ఉత్తమ గణాంకాలను సాధించాడు.  

ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అశ్విన్‌ 22.17 సగటు కలిగి ఉండగా.. విరాట్‌ 19.64, రోహిత్‌ 18.18 సగటున పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్విన్‌కు జతగా పడిక్కల్‌ (48) కూడా రాణించడంతో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది.  
చదవండి: రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. నరాలు తెగే ఉత్కంఠ తప్పదా..?

మరిన్ని వార్తలు