IPL 2022 - MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని

9 May, 2022 10:59 IST|Sakshi
చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(PC: IPL/BCCI)

IPL 2022 CSK Vs DC- MS Dhoni Comments: ఆలస్యంగానైనా అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏకంగా 91 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. దీంతో ఐపీఎల్‌-2022లో ధోని సేన నాలుగో గెలుపు నమోదు చేసింది. అయితే, ఆరంభంలో వరుసగా పరాజయాల చెన్నై పరాజయాల పాలైన నేపథ్యంలో.. ప్రస్తుతం అతిపెద్ద విజయం సాధించినా లాభం లేకుండా పోయింది. సీఎస్‌కే ప్లే ఆఫ్‌ ఆశలు దాదాపు ముగిసిపోయినట్లే! 

ఈ నేపథ్యంలో ఢిల్లీపై విజయానంతరం ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించనంత మాత్రాన ప్రపంచమేమీ ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘ఇది పర్ఫెక్ట్‌ గేమ్‌. నిజానికి కాస్త ముందుగా ఇలాంటి విజయం సాధించి ఉంటే ఎంతో బాగుండేది. బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవాలనుకున్నాం. అయితే, మనసులో మాత్రం టాస్‌ ఓడటమే మంచిదైందని నాకు అనిపించింది. 

బౌలర్లు కష్టపడ్డారు. ముఖ్యంగా వాళ్ల(ఢిల్లీ) బిగ్‌ హిట్టర్లను పరుగులు చేయకుండా ఆపాలని ముందే ప్రణాళిక రచించాం. సిమర్‌జీత్‌, ముఖేశ్‌ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. అనుభవం గడిస్తున్న కొద్దీ ఆటపై పూర్తి పట్టు సాధించగలుగుతారు.

స్కూళ్లో ఉన్నప్పటి నుంచే నాకు లెక్కలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నెట్‌రన్‌రేటు ఉపయోగపడుతుందని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్‌ను ఆస్వాదించాలి అంతే! మేము ప్లే ఆఫ్స్‌నకు వెళ్తే చాలా బాగుంటుంది. ఒకవేళ అలా జరుగకపోతే దాని అర్థం ప్రపంచం అంతమైపోయినట్లు కాదు’’ అని ధోని వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 55: చెన్నై వర్సెస్‌ ఢిల్లీ 
టాస్‌ గెలిచింది: ఢిల్లీ
మ్యాచ్‌ స్కోర్లు
చెన్నై: 208/6 (20)
ఢిల్లీ: 117 (17.4)
91 పరుగుల తేడాతో చెన్నై విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డెవాన్‌ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు- 87 పరుగులు)
 

చదవండి👉🏾Dinesh Karthik: స్ట్రైక్‌ రేటు 375.. దినేశ్‌ కార్తిక్‌తో అట్లుంటది! శెభాష్‌ అన్న కోహ్లి!

Poll
Loading...
మరిన్ని వార్తలు