MS Dhoni On Ravindra Jadeja: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు!

2 May, 2022 13:41 IST|Sakshi
ధోనితో జడేజా(ఫైల్‌ ఫొటో: కర్టెసీ: IPL/BCCi)

IPL 2022 CSK VS SRH- MS Dhoni Comments On Ravindra Jadeja: ‘‘తాను రానున్న ఎడిషన్‌కు గానూ కెప్టెన్‌ అవుతానని జడేజాకు ముందే తెలుసు. సారథిగా తనను తాను నిరూపించుకోవడానికి అతడికి కావాల్సినంత సమయం దొరికింది. నాయకత్వ మార్పు జరగాలనీ.. అతడు కెప్టెన్‌ కావాలని నేను భావించాను. మొదటి రెండు మ్యాచ్‌లలో జడ్డూకు సాయం చేశాను. కానీ తర్వాత బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయాల్లో తాను సొంత నిర్ణయాలు తీసుకునేలా పూర్తి స్వేచ్ఛనిచ్చాను’’ అని చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అన్నాడు. 

అదే విధంగా.. కెప్టెన్‌కు కీలక సమయంలో సొంత నిర్ణయాలు తీసుకునే సమర్థత ఉండాలని, వాటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు తాను కెప్టెన్సీ తప్పుకొన్నట్లు ధోని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చెన్నై సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే, గతేడాది చాంపియన్‌ అయిన చెన్నై జడ్డూ సారథ్యంలో ఘోర పరాజయాలు చవిచూసింది. 

పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో ధోని మళ్లీ చెన్నై పగ్గాలు చేపట్టాడు. వచ్చీరాగానే జట్టును గెలిపించి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విజయానంతరం ధోని మాట్లాడుతూ.. జడేజా తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘కెప్టెన్‌ అంటే మైదానంలో అప్పటికప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

కేవలం టాస్‌కు మాత్రమే నేను కెప్టెన్‌ని.. మిగతాదంతా ఎవరో చేస్తున్నారు అనే ఫీలింగ్‌ తనకు రాకూడదనే మొదటి రెండు మ్యాచ్‌లు మినహా నేను పెద్దగా జోక్యం చేసుకోలేదు. క్రమక్రమంగా నాయకత్వ మార్పు జరగాలని నేను ఆశించాను. కెప్టెన్‌ అన్న వాడు సొంత నిర్ణయాలు తీసుకోవడమేగాక అందుకు కట్టుబడి ఉండాలి’’ అని పేర్కొన్నాడు.

ఇక ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతూ.. స్పూన్‌ ఫీడింగ్‌ చేస్తేనే కెప్టెన్సీ చేయగలను అంటే.. అది భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగపడదంటూ జడ్డూను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే, అదే సమయంలో జడేజాపై కెప్టెన్సీ భారం కారణంగా డీప్‌ మిడ్‌ వికెట్‌ ఫీల్డర్‌ సేవలు తాము కోల్పోయామని, అది తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.

కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ విజయంపై హర్షం వ్యక్తం చేసిన ధోని.. సమష్టి కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నాడు. ఇక ఆదివారం నాటి హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ బృందంపై ధోని సేన 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది మూడో గెలుపు.

ఐపీఎల్‌ మ్యాచ్‌-46: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్లు
చెన్నై-202/2 (20)
హైదరాబాద్‌-189/6 (20)

చదవండి👉🏾IPL 2022- KKR: అసలు కేకేఆర్‌ కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ ఏం చేస్తున్నారు? మరీ చెత్తగా..

Poll
Loading...
మరిన్ని వార్తలు