ముంబై ఇండియన్స్‌ 0–6

17 Apr, 2022 05:17 IST|Sakshi

వరుసగా ఆరో మ్యాచ్‌లో ఓడిన మాజీ చాంపియన్‌

18 పరుగులతో లక్నో విజయం

కేఎల్‌ రాహుల్‌ అజేయ సెంచరీ

ముంబై: ‘వరుస పరాజయాలతో వెనుకబడటం, ఆ తర్వాత పుంజుకొని టైటిల్‌ వరకు దూసుకుపోవడం ముంబై ఇండియన్స్‌కు కొత్త కాదు... మరోసారి మన జట్టు సత్తా చాటుతుంది’ ...ప్రతీ మ్యాచ్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వినిపిస్తున్న సంభాషణ ఇది. కానీ ఐపీఎల్‌–2022లో ఇంకా పాయింట్ల ఖాతా తెరవని ఆ జట్టు పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపిస్తోంది.

వరుసగా ఆరో పరాజయంతో రోహిత్‌ శర్మ బృందం ముందంజ వేసే అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే! శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (60 బంతుల్లో 103 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి ఓడిపోయింది. సూర్యకుమార్‌ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు), బ్రెవిస్‌ (13 బంతుల్లో 31; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.    

కీలక భాగస్వామ్యం
దూకుడైన ఆటతో తొలి వికెట్‌కు 33 బంతుల్లోనే 52 పరుగులు జోడించి ఓపెనర్లు రాహుల్, డికాక్‌ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్‌) లక్నోకు శుభారంభం అందించారు. కెరీర్‌లో 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన రాహుల్‌... మిల్స్‌ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టాడు. అలెన్‌ తొలి ఓవర్లో సిక్స్‌ కొట్టి తర్వాతి బంతికే డికాక్‌ నిష్క్రమించాడు. మూడో స్థానంలో వచ్చిన పాండే కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. స్టొయినిస్‌ (10), దీపక్‌ హుడా (15) కొన్ని కీలక పరుగులు జోడించగా... మిల్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో 56 బంతుల్లో రాహుల్‌ శతకం పూర్తయింది.   

రాణించిన బ్రెవిస్‌...
ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ (6), ఇషాన్‌ కిషన్‌ (13) మరోసారి ముంబైని నిరాశపర్చారు. బ్రెవిస్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు కొన్ని మెరుపులు కనిపించాయి. ఆ తర్వాత సూర్యకుమార్, తిలక్‌ వర్మ (26; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా వారి నుంచి భారీ షాట్లు రాలేదు. వీరిద్దరు ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ దశలో విజయం కోసం 27 బంతుల్లో 73 పరుగులు అవసరం కాగా, పొలార్డ్‌ (14 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై 3 వికెట్లు కోల్పోయి 7 పరుగులే చేయగలిగింది.

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (నాటౌట్‌) 103; డికాక్‌ (ఎల్బీ) (బి) అలెన్‌ 24; పాండే (బి) మురుగన్‌ అశ్విన్‌ 38; స్టొయినిస్‌ (సి) రోహిత్‌ (బి) ఉనాద్కట్‌ 10; హుడా (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) ఉనాద్కట్‌ 15; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1–52, 2–124, 3–155, 4–198.
బౌలింగ్‌: తిలక్‌ వర్మ 1–0–7–0, ఉనాద్కట్‌ 4–0–32–2, మురుగన్‌ అశ్విన్‌ 4–0–33–1, బుమ్రా 4–0–24–0, మిల్స్‌ 3–0–54–0, అలెన్‌ 4–0–46–1.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (బి) స్టొయినిస్‌ 13; రోహిత్‌ (సి) డికాక్‌ (బి) అవేశ్‌ 6; బ్రెవిస్‌ (సి) హుడా (బి) అవేశ్‌ 31; సూర్యకుమార్‌ (సి) (సబ్‌) గౌతమ్‌ (బి) బిష్ణోయ్‌ 37; తిలక్‌ వర్మ (బి) హోల్డర్‌ 26; పొలార్డ్‌ (సి) స్టొయినిస్‌ (బి) చమీరా 25; అలెన్‌ (సి) చమీరా (బి) అవేశ్‌ 8; ఉనాద్కట్‌ (రనౌట్‌) 14; మురుగన్‌ అశ్విన్‌ (రనౌట్‌) 6; బుమ్రా (నాటౌట్‌) 0; మిల్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–16, 2–57, 3–57, 4–121, 5–127, 6–153, 7–175, 8–181, 9–181.
బౌలింగ్‌: హోల్డర్‌ 4–0–34–1, చమీరా 4–0–48–1, అవేశ్‌ 4–0–30–3, బిష్ణోయ్‌ 4–0–34–1, స్టొయినిస్‌ 2–0–13–1, కృనాల్‌ 2–0–16–0.
 

మరిన్ని వార్తలు