రెండు గ్రూప్‌లు... జట్లకు సీడింగ్‌లు

26 Feb, 2022 04:32 IST|Sakshi

10 జట్లతో ఐపీఎల్‌ కొత్త తరహా షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్‌ మొత్తం 74 మ్యాచ్‌లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్‌లతో రెండు సార్లు తలపడి లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్‌లే ఆడనుండగా, ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్‌లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్‌ మ్యాచ్‌ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్‌ నిర్వహిస్తారు.  

ఎలా ఆడతారు?  
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్‌ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్‌ ‘ఎ’ గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

ఎక్కడ ఎన్ని మ్యాచ్‌లు?
70 లీగ్‌ మ్యాచ్‌లలో 20 మ్యాచ్‌లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్‌లు ముంబై డీవై పాటిల్‌ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు ముంబై బ్రబోర్న్‌ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది.

ఏ గ్రూప్‌లో ఎవరు?
ఐపీఎల్‌లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్‌ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్‌ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్‌ టీమ్‌ గ్రూప్‌ ‘ఎ’లో, రెండో సీడ్‌ గ్రూప్‌ ‘బి’లో... ఇలా పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.  

గ్రూప్‌ ‘ఎ’: ముంబై ఇండియన్స్‌ (సీడింగ్‌–1), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(3), రాజస్తాన్‌ రాయల్స్‌ (5), ఢిల్లీ క్యాపిటల్స్‌ (7), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (9). గ్రూప్‌ ‘బి’: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (4), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (6), పంజాబ్‌ కింగ్స్‌ (8), గుజరాత్‌ టైటాన్స్‌ (10).

మరిన్ని వార్తలు