IPL 2022: ఇకపై అలా కుదరదు.. సింగిల్‌ తీస్తే కానీ..

23 Mar, 2022 08:42 IST|Sakshi

కొత్తగా... కొన్ని విశేషాలతో

ఐపీఎల్‌ ప్రసారంలో ఆసక్తికర అంశాలు

పలు నిబంధనలు మార్చిన గవర్నింగ్‌ కౌన్సిల్‌

సుమారు 5 కోట్లు... ఐపీఎల్‌ మెగా వేలంను అనుసరించిన వీక్షకుల సంఖ్య ఇది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌ మార్చి 26 నుంచి మొదలవుతున్నా ఆసక్తి మాత్రం ఫిబ్రవరి 12 నుంచే మొదలైందని ఈ అంకె చెబుతోంది.

గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అభిమానులు ఆటకు ముందే వేలంపై కూడా బాగా దృష్టిపెట్టారని అర్థమవుతోంది. దీనిని మరింత ముందుగా తీసుకుపోయే విధంగా ప్రసారకర్తలు ఈసారి మ్యాచ్‌లను ఫ్యాన్స్‌ కోణంలో ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని కొత్త సాంకేతికాంశాలను జోడించేందుకు ప్రయత్నిస్తున్నారు.- సాక్షి క్రీడా విభాగం 

అడిగిన వెంటనే సమాధానమిచ్చే ‘అలెక్సా’ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు ఇదే తరహా టెక్నాలజీతో స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ కోసం కొత్తగా ‘క్రికో’ అనే రోబోను ఆటలోకి తీసుకొచ్చింది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఆటగాళ్ల ప్రదర్శన, పాత గణాంకాలకు సంబంధించి కామెంటేటర్లకు వచ్చిన సందేహాలను ఈ ‘రోబో’ తీరుస్తుంది.

సరిగ్గా చెప్పాలంటే ‘క్రికో’ కూడా వ్యాఖ్యాతల బృందంలో భాగమే. మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులను కూడా ఇందులో భాగం చేసి వారు అడిగే ప్రశ్నలకు కూడా ‘క్రికో’ జవాబిచ్చే విధంగా ప్రసారకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోహ్లి ఆడిన షాట్‌ల గురించి, బుమ్రా స్లో బంతుల గురించి 30 సెకన్లలోపు ‘క్రికో’ సమాధానమిస్తుంది.  

భాషతో అభిమానులకు చేరువగా... 
ఐపీఎల్‌ను తొలిసారి 9 భాషల వ్యాఖ్యానంతో ప్రసారం చేస్తున్నారు. లీగ్‌లో కొత్తగా గుజరాత్‌ జట్టు చేరడంతో తొలిసారి గుజరాతీ భాషలో కూడా కామెంటరీ రానుండగా, నాలుగు వేదికలు మహారాష్ట్రలోనే ఉండటంతో ఈసారి అన్ని మ్యాచ్‌లలో కూడా మరాఠీ వ్యాఖ్యానం వినిపిస్తుంది. అయితే మ్యాచ్‌ ఆడుతున్న జట్టును బట్టి ఆయా టీమ్‌తో అనుబంధం ఉన్న ప్రాంతాల్లో స్థానికత ప్రతిబింబించేలా కామెంటరీ  వినిపించడం, వీడియోలు కనిపించడం ఈసారి ఐపీఎల్‌ ప్రత్యేకత.

‘సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తెలుగు కామెంటరీ మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌కు చేరువయ్యే స్థానిక విషయాలతో మరింత వివరంగా ఒక్కో అంశం గురించి వ్యాఖ్యానం సాగుతుంది. ఇందు కోసం స్టేడియాల్లో అదనపు కెమెరాలను కూడా ఏర్పాటు చేశాం’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ హెడ్‌ సంజోగ్‌ గుప్తా తెలిపారు. ఇక ‘నడిచే ఇంగ్లిష్‌ డిక్షనరీ’లాంటి రవిశాస్త్రిని వ్యాఖ్యాతల బృందంలో చేర్చిన ప్రసారకర్తలు... అతనితో ఇంగ్లీష్‌లో కాకుండా హిందీలో కామెంటరీ చేయించబోతున్నారు.


     
రెండు రివ్యూలు... 
ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ 2022 లీగ్‌లో కొన్ని మార్పులతో టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది. ముఖ్యంగా అంపైర్‌ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)లో రివ్యూల సంఖ్య పెంచడం కీలక సమయాల్లో జట్లకు కలిసి రానుంది. ఇప్పటి వరకు ఇన్నింగ్స్‌లో ఒకే ఒక రివ్యూ తీసుకునే అవకాశం ఉండగా దానిని రెండుకు పెంచారు. అదే తరహాలో ఇన్నింగ్స్‌ మధ్యలో తీసుకునే ‘స్ట్రాటజిక్‌ టైమౌట్‌’ను కూడా 150 సెకన్ల నుంచి 180 సెకన్లకు పెంచారు.  

ఇకపై అలా కుదరదు
ఇక ఐసీసీ అక్టోబరు నుంచి అమలు చేయబోయే ‘బ్యాటర్‌ చేంజ్‌’ను అంతకంటే ముందే ఐపీఎల్‌లో ప్రవేశపెడుతున్నారు. రనౌట్‌ అయిన సమయంలో ఇద్దరు ఆటగాళ్లు ఒకరిని మరొకరు ‘క్రాస్‌’ చేసినా, చేయకపోయినా కొత్త బ్యాటర్‌ అంతకుముందు అవుటైన ఆటగాడి స్థానంలోనే స్ట్రయికింగ్‌ తీసుకుంటాడు. ఇప్పటి వరకు బలహీన బ్యాటర్‌ ఎవరైనా రనౌట్‌ అయ్యే అవకాశం ఉంటే ప్రధాన బ్యాటర్‌ అతడిని దాటి స్ట్రయికింగ్‌కు ప్రయత్నించేవాడు. ఇకపై అలా కుదరదు. సింగిల్‌ తీస్తే కానీ తనకు బ్యాటింగ్‌ అవకాశం రాదు. 

చదవండి: క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..

మరిన్ని వార్తలు