IPL 2022: రెండో స్థానానికి ఎగబాకిన లక్నో.. ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగులు

1 May, 2022 20:28 IST|Sakshi

LSG VS DC: వాంఖడే వేదికగా ఇవాళ (మే 1) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక సమరంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో రాహుల్‌ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్‌ హుడా (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్‌), బౌలింగ్‌లో మోహిసిన్‌ ఖాన్‌ (4/16) రాణించడంతో లక్నో సూపర్‌ విక్టరీ సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 

ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ సేన 7 విజయాలు, 3 పరాజయాలతో 0.397 రన్‌రేట్‌ కలిగి ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లక్నో.. మ్యాచ్‌ మ్యాచ్‌కు రాటు దేలుతూ టైటిల్‌ దిశగా అడుగులు వేస్తుంది. ఇక లక్నో తరహాలోనే అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన మరో న్యూ ఎంట్రీ గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతాలు జరిగి ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే తప్ప ఈ సమీకరణలు మారకపోవచ్చు. గుజరాత్‌.. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, ఓ పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

పాయింట్ల పట్టికలో గుజరాత్‌, లక్నో జట్ల తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు), సన్‌రైజర్స్‌ (8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 5 పరాజయాలతో 10 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), పంజాబ్‌ (9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), కేకేఆర్‌ (9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), చెన్నై (8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు), ముంబై (9 మ్యాచ్‌ల్లో ఓ విజయం, 8 పరాజయాలతో 2 పాయింట్లు) జట్లు వరుసగా ఉన్నాయి. 
చదవండి: అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు