IPL 2022 PBKS Vs RCB: రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం.. క్రెడిట్‌ వాళ్లదే: మయాంక్‌

28 Mar, 2022 08:08 IST|Sakshi
(PC: IPL Twitter)

IPL 2022- నవీ ముంబై: ఆదివారం ఐపీఎల్‌ పసందైన విందు ఇచ్చింది. 27 సిక్సర్లతో (బెంగళూరు 13, పంజాబ్‌ 14)... 413 పరుగులతో ( 205 + 208) రెట్టింపు వినోదాన్ని పంచింది. ఒక సిక్సర్‌ ఎక్కువ కొట్టిన పంజాబ్‌ ఐదు వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి బోణీ కొట్టింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్‌ డుప్లెసిస్‌ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. కొండంత లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలోనే 208 పరుగులు చేసి ముగించింది. ఓపెనర్లు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్‌ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) , రాజపక్స (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటికి పంజాబ్‌ లక్ష్యంవైపు సాఫీగా సాగిపోయింది.

షారుఖ్‌ ఖాన్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఒడెన్‌ స్మిత్‌ (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు 4.1 ఓవర్లలో 52 పరుగులు జోడించి పంజాబ్‌ను గెలిపించారు. 

రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం: మయాంక్‌ అగర్వాల్‌
పంజాబ్‌ కెప్టెన్‌గా తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ గెలుపుతో సీజన్‌ ఆరంభించడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు పాయింట్లు అనేవి మాకు చాలా చాలా ముఖ్యం. వికెట్‌ బాగుంది.

ఇరు జట్లు 200కు పైగా పరుగులు సాధించడం చూస్తుంటూనే అర్థమవుతోంది. జట్టు ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నాం. నాకు తెలిసి మేము 15- 20 పరుగులు ఎక్కువగా ఇచ్చి ఉంటాం. విరాట్‌, ఫాఫ్‌ కలిసి మ్యాచ్‌ను తమ వైపు లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్‌.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!


 

మరిన్ని వార్తలు