IPL 2022 Auction: సగం పని పూర్తైంది.. మా జట్టు భేష్‌.. టైటిల్‌ గెలవడమే లక్ష్యం! లేదంటే కనీసం ప్లే ఆఫ్స్‌ అయినా!

26 Feb, 2022 13:57 IST|Sakshi

IPL 2022 Mega Auction- Punjab Kings: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. పంజాబ్‌ కింగ్స్‌గా మారింది.. కెప్టెన్లను కూడా మార్చింది. పేరు మార్చినా.. కెప్టెన్లను మార్చినా రాతను మాత్రం మార్చుకోలేకపోయింది. కీలక మ్యాచ్‌లలో ఆఖరిదాకా పోరాడటం.. తీరా సమయానికి చేతులెత్తేయడం.. వెరసి ఇంత వరకు ఒక్కసారి కూడా  ట్రోఫీ గెలవలేదన్న లోటు అలాగే ఉండిపోయింది.

అయితే, ఈసారి ఆ బెంగ తీరిపోతుందని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌ వాడియా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ మెగా వేలం- 2022లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని సగం పని పూర్తిచేశామని పేర్కొన్నాడు. కాగా బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో భాగంగా పంజాబ్‌.. ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను అత్యధిక ధర(రూ. 11.50 కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

అదే విధంగా ర‌బ‌డ, శిఖర్‌ ధావ‌న్‌ను వంటి స్టార్‌ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం జ‌ట్టులో మొత్తంగా 25 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో భార‌త క్రికెట‌ర్‌లు 18 మంది కాగా, విదేశీ ఆట‌గాళ్లు ఏడుగురు. వీరి కోసం ఫ్రాంఛైజీ తమ పర్సు నుంచి రూ. 86 కోట్ల 55 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెస్‌ వాడియా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ట్రోఫీ సాధించాలంటే సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం అవసరం. మంచి జట్టు దొరికితే సగం గెలిచినట్లే. మేము చేసింది అదే! ఇప్పుడు భారమంతా ఆటగాళ్లు, కోచ్‌లు అనిల్‌ కుంబ్లే, జాంటీ రోడ్స్‌, డెమిన్‌ మీదనే ఉంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్‌ అందిస్తారని భావిస్తున్నాం. లేదంటే కనీసం టాప్‌-4లోనైనా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత నాలుగైదేళ్లుగా మా ప్రదర్శన అస్సలు బాగాలేదు.

దానిని అధిగమించాలనుకుంటున్నాం. ఇప్పుడు మా జట్టు సమతుల్యంగా ఉంది. మంచి బ్యాటర్లు, బౌలర్లను ఎంచుకున్నాం. నాకు తెలిసి 2008 తర్వాత మేము ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, విజయవంతమైన ఐపీఎల్‌ వేలం ఇదే’’ అని నెస్‌ వాడియా చెప్పుకొచ్చాడు. కాగా కేఎల్‌ రాహుల్‌ జట్టును వీడటంతో పంజాబ్‌ ఇప్పుడు కెప్టెన్‌ ఎంపిక అంశంలో బిజీగా ఉంది. సీనియర్‌ శిఖర్‌ ధావన్‌ లేదంటే, మయాంక్‌ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టు
మయాంక్‌ అగర్వాల్‌, లివింగ్‌స్టోన్‌, రబడ, షారుఖ్‌ ఖాన్‌, ధావన్‌, బెయిర్‌స్టో, ఒడియన్‌ స్మిత్‌, రాహుల్‌ చహర్‌, అర్శ్‌దీప్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాజ్‌ బావా, వైభవ్‌ అరోరా, నాథన్‌ ఎలిస్‌, ప్రభ్‌సిమ్రన్‌, రిషి ధావన్‌, భనుక రాజపక్స, సందీప్‌ శర్మ, బెన్ని హోవెల్‌, ఇషాన్‌ పొరెల్‌, ప్రేరక్‌ మన్కడ్‌, జితేశ్‌ శర్మ, బల్‌తేజ్‌ సింగ్‌, రితిక్‌ ఛటర్జీ, అథర్వ తైడ్‌, అన్శ్‌ పటేల్‌.

చదవండి: IPL 2022- MS Dhoni: ఆ మ్యాచ్‌లు అన్నీ మహారాష్ట్రలోనే... ధోని మాస్టర్‌ ప్లాన్‌.. ముంబైని కొట్టాలిగా మరి!

మరిన్ని వార్తలు