Krunal Pandya: ఆయన వల్లే ఇదంతా.. బ్యాట్‌తో కూడా రాణిస్తా: కృనాల్‌

30 Apr, 2022 08:13 IST|Sakshi
కృనాల్‌ పాండ్యా(PC: IPL/BCCI)

IPL 2022 PBKS Vs LSG: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు కృనాల్‌ పాండ్యా అదరగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు కీలక వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను లక్నో బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు.

దుష్మంత చమీర, కృనాల్‌ పాండ్యా, మోహ్సిన్‌ ఖాన్‌ ధాటికి పంజాబ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రాహుల్‌ బృందం.. మయాంక్‌ సేనపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ వేసిన కృనాల్‌ పాండ్యా కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. 

ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మాట్లాడుతూ తన ఆట పట్ల సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘గత ఏడెమినిది నెలలుగా కఠినంగా శ్రమిస్తున్నాను. బాగా బౌలింగ్‌ చేయగలుగుతున్నాను. ఇక్కడ రాహుల్‌ సాంఘ్వీ పేరు తప్పక ప్రస్తావించాలి. నా నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంలో ఆయన పాత్ర ఉంది.

ఆయన సలహాలు, సూచనలు నాకెంతో ఉప‍కరించాయి’’ అని టీమిండియా మాజీ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ రాహుల్‌ సంఘ్వీ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. బాల్‌ను రిలీజ్‌ చేసే సమయంలో ఎత్తు, గ్రిప్‌ సహా పలు టెక్నిక్‌ అంశాలపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు.

ఇక బ్యాటింగ్‌ చేయడం తనకెంతో ఇష్టమన్న ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా.. ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయానని, ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదుర్కొన్న కృనాల్‌ 7 పరుగులు చేసి.. కగిసో రబడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌-42: పంజాబ్‌ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ స్కోర్లు
లక్నో- 153/8 (20)
పంజాబ్‌- 133/8 (20)

చదవండి👉🏾 చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా!

>
Poll
Loading...
మరిన్ని వార్తలు